
ఆ 5 శాఖలు...!
సాక్షిప్రతినిధి, వరంగల్ : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు ముమ్మరమైనా.. కొందరు అధికారులు, ఉద్యోగుల్లో మార్పు లేదు. లంచం.. లంచం.. లంచం.. ఈ పదం కొన్ని శాఖల్లో సర్వసాధారణంగా మారింది. అవసరం కొద్ది లంచం ఇవ్వడం.. అధికారులు తీసుకోవడం అనివార్యంగా మారుతోంది. హద్దులు దాటి అధికంగా డిమాండ్ చేసినప్పుడు... బాధితులు ఏసీబీని ఆశ్రయించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లాలో పలువురు అధికారులు ఏసీబీకి చిక్కుతుండడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా రెవెన్యూ, రవాణా, పోలీసు, రిజిస్ట్రేషన్, విద్యుత్‌శాఖల్లో పెచ్చుమీరిన అవినీతి కొందరికీ శాపంగా మారింది. కాళేశ్వరం వివాదం తర్వాత నీటిపారుదలశాఖలో పనిచేసే అధికారులు కొందరు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కటకటాల పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా.. ఉమ్మడి వరంగల్‌లో అవినీతి, అక్రమాలు యథాతధంగా కొనసాగుతూనే ఉన్నాయి.
వరుస ఘటనలు..
తీరుమారని అధికారులు...
ఉమ్మడి వరంగల్‌లో వరుసగా కొందరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కుతున్నారు. మరికొందరు ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదులతో దాడులకు గురవుతున్నారు. ఆగస్టులో ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపి, అక్రమాస్తులను గుర్తించారు. ఫిబ్రవరిలో వరంగల్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్‌పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి, సోదాలు నిర్వహించారు. అంతకుముందు ఇరిగేషన్ డిపార్టుమెంట్‌లో ఈఈగా పని చేస్తున్న నూనె శ్రీధర్‌పైన ఏసీబీ దాడులు నిర్వహించి రూ.200 కోట్ల వరకు ఆస్తులను గుర్తించినట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సీఐ జగదీశ్ ఓ బెల్లం వ్యాపారానికి సంబంధించి రూ.4లక్షలు డిమాండ్ చేసి లంచం తీసుకున్న కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పీఆర్ ఇంజనీరింగ్ విభాగంలోని ఏఈ రమేశ్, ఆయన అసిస్టెంట్ రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఓ కేసు నుంచి నిందితులను తప్పించేందుకు లంచం తీసుకున్న పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్నను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం రూ.19,200లు మహబూబాబాద్ సబ్ రిజిష్ట్రార్ తస్లీమా మహమ్మద్‌ను అప్పట్లో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మహబూబాబాద్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహించి అక్రమాస్తులను గుర్తించారు. విద్యుత్‌శాఖ హైదరాబాద్‌లో పనిచేసే ఏడీఈ అంబేద్కర్‌పై ఏసీబీ దాడులు, వెల్లడైన అక్రమాస్తుల నేపథ్యంలో ఆశాఖ అధికారులపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఉమ్మడి వరంగల్‌లో వరుసగా ఏసీబీ దాడులు, కేసులు అవుతున్నా ఆ ఐదు శాఖల్లోని కొందరు అధికారుల్లో మార్పు రాకపోవడంపై చర్చ జరుగుతోంది.
అవినీతి పరులపై ఆరా..
అవినీతి, అక్రమార్కులపై ఏసీబీ దూకుడు పెంచడంతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ, పోలీసు, రవాణా, రిజిస్ట్రేషన్, విద్యుత్‌శాఖలతో పాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్, ‘కుడా’లలోని పలు విభాగాల్లో కొందరు అధికారులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ పనికి ఓ రేటును ఫిక్స్ చేసి మధ్యవర్తుల ద్వారా వసూలు చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని కొందరు పోలీసు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లపైన భూదందాలు, సెటిల్‌మెంట్ల పేరిట భారీగా వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల కోసం భూసేకరణ, రిజిస్ట్రేషన్‌లు, మ్యుటేషన్‌ల పేరిట రెవెన్యూ అధికారుల వసూళ్లు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ, అసైన్డ్, ఎఫ్‌టీఎల్ స్థలాలు, ఎల్‌ఆర్‌ఎస్ లేని నాన్ లేఅవుట్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు చేస్తూ భారీగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల కొందరు సబ్ రిజిస్ట్రార్లపై ఉన్నాయి. అదే విధంగా విద్యుత్‌శాఖలో కొందరు అధికారులు బినామీలను పెట్టుకుని కాంట్రాక్టులు చేస్తుండడంతో పాటు విద్యుత్ కనెక్షన్‌లు, సదుపాయాల కల్పనకు పెద్ద మొత్తంలో లంచాలు డిమాండ్ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. రవాణాశాఖ హనుమకొండ, వరంగల్ డీటీఓ కార్యాలయాల్లో హద్దుల దాటిన అవినీతిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతున్నా ఏసీబీ అధికారులు మౌనం వహించడంపై చర్చ జరుగుతోంది. జీడబ్ల్యూఎంసీ, కుడాలలో కొందరు అవినీతి అధికారులపై బాధితులు ఏసీబీని సంప్రదించినట్లు చెప్తున్నారు. ఏదేమైనా ఏసీబీ దూకుడుతో రోజురోజుకూ అవినీతికి పాల్పడే వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం కలకలం రేపుతోంది.
అవినీతి ఆరోపణల్లో ముందు వరుస
తీరు మారని పోలీస్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్, రవాణా, విద్యుత్ శాఖలు
ఏసీబీకి చిక్కుతున్నా వీడని ఆయా శాఖల అధికారుల కక్కుర్తి
కాసుల కోసం అడ్డదారులు.. అక్రమార్జనే ధ్యేయంగా పనులు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వీరిపైనే అధిక ఫిర్యాదులు
నీటిపారుదలశాఖ అధికారులపైనా పెరిగిన దాడులు