
షాపింగ్..సందడి
జనగామ: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయ పండుగ బతుకమ్మ సమీపిస్తుండడంతో జిల్లాకేంద్రంలోని దుకాణాల్లో సందడి నెలకొంది. మహిళలు, యువతులు కొత్త బట్టలు, బంగారు నగలు, అలంకార వస్తువుల కొనుగోళ్లలో మునిగిపోయారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, వాణిజ్య కేంద్రాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నెల 21వ తేదీన బతుకమ్మ పండుగ ప్రారంభం కానుండడంతో పల్లెలు, పట్టణాలు కోలాహాలంగా మారనున్నాయి.
ప్రత్యేక ఆఫర్లు
ప్రతి ఏటా దసరా, బతుకమ్మ సీజన్‌న్‌లోనే వ్యాపారులకు అధిక ఆదాయం వస్తుంది. ఈసారి కూడా చీరలు, సంప్రదాయ దుస్తులు, డిజైనర్ బట్టలకు పెద్దఎత్తున డిమాండ్ పెరిగింది. ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లతో వస్త్ర వ్యాపారులు వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా వన్‌గ్రామ్ గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. కొత్త ఆభరణాలతో పండుగను జరుపుకోవాలని మహిళలు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ, పేద, మధ్య తరగతి కుటుంబాలకు ధరలు దూరం చేస్తున్నాయి. 10 గ్రాముల బంగారం ధరలు రూ.1.10 లక్షలకు పైగా పెరగడంతో మహిళలు వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు. పండుగకు ముందుగానే బిజినెస్ ఊపందుకోవడంతో వ్యాపార వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
జిల్లా కేంద్రంలో జోరందుకున్న
‘బతుకమ్మ’ కొనుగోళ్లు
కిటకిటలాడుతున్న కంగన్‌హాల్స్, బట్టల దుకాణాలు
వన్‌గ్రామ్ గోల్డ్‌కు పెరిగిన గిరాకీ

షాపింగ్..సందడి