
టెక్నాలజీ ఉపయోగించి బోధించాలి
● జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళాలో
ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్
జనగామ రూరల్: విద్యార్థుల అభ్యసన ప్రగతికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి ఉత్తమ బోధన చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక సాయిరాం కన్వెన్షన్ హాల్‌లో జిల్లాస్థాయి టీఎల్‌ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్) మేళాలో నిర్వహించారు. జిల్లాలోని 12 మండలాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు గెలుచుకున్న ఉపాధ్యాయులు జిల్లాస్థాయిలో వాటిని ఎగ్జిబిట్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ హాజరై ఎగ్జిబిట్లను పరిశీలించారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం, పరిసరాల విజ్ఞానానికి సంబంధించి ప్రతీ మండలానికి పది చొప్పున మొత్తం 120 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్ ఏఎంవో శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు రఘుజీ, డా.వెంకటేశం, రాజపాల్‌రెడ్డి, సుధాకర్, రాజేంద్రకుమార్, ఉపాధ్యాయులు వసంత, పద్మ, హిమబిందు, రాంబాబు పాల్గొనగా.. అనిత, దుర్గాప్రసాద్ ,నరసింహారావు,ఝాన్సీ లక్ష్మీ భాయ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
మెరుగైన వైద్యసేవలందించాలి..
నిరుపేదలకు వైద్యసేవలు అందించడంపై వైద్యులు బాధ్యతగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ పింకేశ్ కుమార్ సూచించారు. మండలంలోని ఓబుల్‌కేశావాపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా పీహెచ్‌సీలో ప్రముఖ డెంటల్ డాక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్‌ను పరిశీలించారు. ఎస్‌ఎన్‌ఎస్‌పీఏ స్పెషాలిటీ ఓపీ సేవలు ప్రతీ గ్రామంలో అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లావైద్యాధికారి మల్లికార్జునరావు, వైద్యులు పాల్గొన్నారు.