
ఫోన్లు కొంటే బిల్లులు తీసుకోండి
జనగామ: ప్రజలు కొత్త ఫోన్లను కొనుగోలు చేసే సమయంలో బిల్లులను తీసుకుని భద్రపరుచుకోవాలని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. ఏసీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్‌తో కలిసి డీసీపీ పాల్గొన్నారు. జిల్లాలోని మండలాల వారీగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన సుమారు రూ.10లక్షల విలువ చేసే 52 ఫోన్లను డీసీపీ చేతుల మీదుగా యజమానులకు అందజేశారు. డీసీపీ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు తక్కువ ధరకు విక్రయించే మొబైల్స్ కొని మోసపోవద్దని సూచించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు వందలాది మొబైల్స్ రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు. దసరా సెలవుల నేపథ్యంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో కుటుంబాలు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఏసీపీ భీంశర్మ, నర్సయ్య, అంబటి నర్సయ్య, సీఐలు దామోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అబ్బయ్య, వేణు, జానకీరాంరెడ్డి, శ్రీనివాసరావు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
సైబర్ క్రైం జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి
డీసీపీ రాజమహేంద్ర నాయక్
52 మొబైల్స్ రికవరీ, బాధితులకు
అందజేత