
ఈ పరీక్ష పాసైతేనే!
లైసెన్స్‌డ్ సర్వేయర్ల సప్లిమెంటరీ
పరీక్ష వివరాలు
జనగామ: జిల్లాలో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఆదివారం(నేడు) జరగనున్న సప్లిమెంటరీ పరీక్షకు సర్వం సిద్ధం చేశారు. కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో పరీక్షల నోడల్ ఆఫీసర్, జిల్లా సర్వే డిపార్ట్‌మెంట్ ఏడీ మణ్యంకొండ, ఎగ్జామ్ కన్వీనర్ నూకరాజు నేతృత్వంలో పర్యవేక్షణ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వచ్చిన భూభారతి చట్టం–2025 భూమి కొలతలు, సర్వే చేసేందుకు లైసెన్స్ పొందిన సర్వేయర్ల కోసం ఈ ఏడాది జూలై 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించింది. ఇందులో 173 మంది పరీక్షలు రాయగా, 48 మంది మాత్రమే అర్హత సాధించారు. 100 మార్కులకు గాను 60 స్కోర్ సాధించినవారు లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అర్హత సాధించగా, 125 మంది అర్హత ఫెయిల్ కాగా, ఆదివారం జరిగే పరీక్షకు వీరంతా హాజరై మరోసారి తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు.
ఏబీవీలో పరీక్ష కేంద్రం..
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు థియరీ, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్లాటింగ్ ఎగ్జామ్ జరగనుంది. పరీక్షకు సంబంధించి జనగామ పట్టణంలోని సిద్దిపేటరోడ్డు ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల(అటానమస్)లో పరీక్ష సెంటర్ ఏర్పాటు చేశారు. కాగా, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అభ్యర్థులు 9.45 గంటల కల్లా సెంటర్ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన వారికి అనుమతి ఉండదు. అభ్యర్థి వెంట సెల్‌ఫోన్ అనుమతి లేదు. పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య, లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పరీక్ష రాసే అభ్యర్థులు : 125
సెంటర్ : ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల
(అటానమస్)
పరీక్ష సమయం : ఉదయం 10 నుంచి మధ్యాహం 1 గంట వరకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు మొబైల్స్‌కు అనుమతి లేదు
నేడు లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సప్లిమెంటరీ
జూలైలో నిర్వహించిన పరీక్షల్లో
48 మంది మాత్రమే ఎంపిక
మిగతా 125మందికి పరీక్ష