
బీజేపీకి నైతికహక్కు లేదు
● సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు
జనగామ రూరల్: నిజాం రాచరికాన్ని ఓడించిన చరిత్ర ముమ్మాటికీ కమ్యూనిస్టులదేనని, సాయుధ పోరాటం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవం పురస్కరించుకొని శనివారం పట్టణంలోని నల్ల నర్సింలు విగ్రహానికి పూలమాలవేసి నివాళ్లు అర్పించారు. అనంతరం జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యురాలు పాతూరి సుగుణమ్మ, ఆకుల శ్రీనివాస్, చొప్పరి సోమయ్య, కావటి యాదగిరి, చామకూర యాకూబ్, చింతకింది అరుణ తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపల్లి: మండలంలోని నిడిగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సీఈఓలుగా పని చేసిన సమయంలో తండ్రీకొడుకులు అవినీతికి పాల్పడటంతో కేసు నమోదు కాగా.. శనివారం తనయుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్ తెలిపారు. గతంలో సొసైటీ సీఈఓలుగా పనిచేసిన పెద్దగోని వెంకటరాజయ్య, అతడి కుమారుడు పెద్దగోని రాజ్‌కుమార్ రైతులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకోవడంతో పాటు, అనేక అక్రమాలకు పాల్పడి రూ.39 లక్షలు దుర్వినియోగం చేసినట్లు కోఆపరేటివ్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని రాజ్‌కుమార్‌ను రిమాండ్‌కు తరలించగా అతడి తండ్రి వెంకటరాజయ్య పరారీలో ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు.