
సమస్యలు పరిష్కరిస్తాం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లా కళాశాల ఐదేళ్ల కోర్సు విద్యార్థుల సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తామని రిజిస్ట్రార్ రామచంద్రం హామీ ఇచ్చారు. ఈనెల 12న ఐదేళ్ల లాకోర్సుల విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయా విద్యార్థులతో శనివారం పరిపాలనాభవనం వద్ద చర్చలు జరిపారు. అయినప్పటికీ విద్యార్థులు వినకుండా పరిపాలనా భవనం వద్ద ధర్నా నిర్వహించారు. మళ్లీ కొంతసేపటికి రిజిస్ట్రార్ రామచంద్రం విద్యార్థులతో మాట్లాడారు. వీసీ ప్రతాప్‌రెడ్డి ఈనెల 23న కేయూకు రానున్నారని సమస్యలను వీసీ దృష్టికి తీసుకెళ్లి దశలవారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. వినతిపత్రాన్ని రిజిస్ట్రార్ రామచంద్రంకు అందజేశారు. రిజిస్ట్రార్ వెంట పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, యూనివర్సిటీ లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సు దర్శన్, కేయూ పాలకమండలి సభ్యులు ఆచా ర్య బి.సురేశ్‌లాల్, లా హాస్టల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ చల్లా శ్రీనివాస్ ఉన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. కేయూ పోలీస్టేషన్ పోలీస్ అధికారులు కూడా అక్కడికి విచ్చేశారు.