
కొత్త అందాలు
మారుతున్న
జనగామ పట్టణ రూపురేఖలు
త్వరగా పూర్తి చేయిస్తాం..
జనగామ: జిల్లా కేంద్రం కొత్త అందాలను సంతరించుకుంటోంది. పట్టణ అభివృద్ధితో పాటు సుందరీకరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆడపడుచులు ఆడంబరంగా జరుపుకునే బతుకమ్మ పండుగ నాటికి పూర్తి కానున్నాయి. చిన్న జిల్లాల్లో సాధారణ పట్టణంగా కనిపించిన జనగామ.. ఇప్పుడు న్యూ లుక్‌తో మెరిసిపోతోంది. సుందరీకరణ పనులు, ప్రజల కోసం ఆహ్లాదకరమైన వేదికలు, అన్నీ కలిసి పట్టణాన్ని అందంగా మార్చేస్తుంది. సుందరీకరణలో పెంబర్తి –యశ్వంతాపూర్–సూర్యాపేట బైపాస్ ముఖ ద్వారం, ఆర్టీసీ చౌరస్తా, బతుకమ్మకుంట ప్రత్యేక ఆకర్షణగా సంతరించుకుంటోంది. తళుక్కుమంటున్న కుంట–ఆకర్షణీయంగా ఆర్టీసీ చౌరస్తా ధర్మోనికుంట బతుకమ్మకుంటగా మారిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతోంది. కుంటను పునరుద్ధరించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. కుంటలోని నీరు ఆహ్లాదాన్ని కలిగిస్తే, సుందరీకరణతో మనసుకు హాయిని ఇస్తోంది. చిన్నపి ల్లల కోసం ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్, యువత కోసం ఔట్‌డోర్ జిమ్, అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా నేల, టైల్స్‌తో వాకింగ్ ట్రాక్, వేదికలు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఐ లవ్ యూ జనగామ పేరిట ప్రత్యేక ఆకర్షణ కలిగించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు చేసే పెద్దలతో పాటు పిల్లలు ఆటలతో కాలక్షేపం చేసే విధంగా బతుకమ్మకుంట కొత్త జీవనశైలికి సంకేతాలుగా ఇస్తోంది.
సూర్య నమస్కారాల విగ్రహాలు..
పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా జంక్షన్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించగా, యోగా, ఆరోగ్యంపై అవగాహన కలిగించే విధంగా సూర్య నమస్కారాల విగ్రహాలను ఏర్పాటు చేశారు. బతుకమ్మకంట జంక్షన్‌లో బటర్‌ఫ్లై, నమస్కారంతో స్వాగత విగ్రహంతో ప్రధాన కూడళ్లన్నీ సరికొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. రాత్రి వేళల్లో రంగు రంగుల లైటింగ్‌తో కూడలి మెరిసిపోతూ పండుగ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పట్టణ అభివృద్ధి అంటే కేవలం రహదారులు మాత్రమే కాదని, సాంస్కృతిక స్పృహను కలిగించే పనులూ అవసరమని దీంతో స్పష్టమవుతోంది. పెంబర్తి, యశ్వంతాపూర్ జిల్లా ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు హైలెట్‌గా నిలుస్తున్నాయి. ముఖ ద్వారం వద్ద తెలంగాణ సాయుధ పోరాటంలో తెగువ చూపిన చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య, సర్ధార్ సర్వాయ్ పాపన్న విగ్రహాలను ప్రతిష్ఠించారు.
భవిష్యత్ దిశగా..
జనగామను కొత్త తరహా పట్టణంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో బతుకమ్మకుంట ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఇది కేవలం ఒక కుంట మాత్రమే కా దు, పట్టణం మొత్తం ఊపిరి పీల్చే ప్రదేశం. భవిష్యత్‌లో రంగప్ప చెరువుతో పాటు ఆయా ప్రాంతాల్లో ఇలాంటి సుందరీకరణ, అభివృద్ధి పనులు కొనసాగితే పట్టణం సాంస్కృతిక, ఆరోగ్య, వినోదాల కేంద్రంగా కూడా గుర్తింపు తెచ్చుకుంటుందని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రం ముఖద్వారంలో
స్వాగత తోరణాలు
సాయుధ పోరాట యోధుల విగ్రహాలు
ఆర్టీసీ చౌరస్తాలో సూర్య నమస్కారాలు
రూ.2.50కోట్లతో సుందరీకరణ పనులు
బతుకమ్మ పండుగ నాటికి పనులు పూర్తి
పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. బతుకమ్మకుంట, పెంబర్తి, యశ్వంతాపూర్, ఆర్టీసీ చౌరస్తా జంక్షన్ తదితర ప్రధాన కూడళ్లలో సుందరీకరణ పనరులు వేగంగా జరుగుతున్నాయి. నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ప్రజల సహకారంతో పనులు త్వరగా పూర్తి చేయిస్తా.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్

కొత్త అందాలు