
సర్దుబాటుపై సమరం
జనగామ: జిల్లా విద్యాశాఖలో టీచర్ల సర్దుబాటు చిలికిచిలికి గాలివానలా మారుతోంది. బెత్తం ఉన్నోళ్లదే పెత్తనం అనే చందంగా సర్దుబాటు ప్రక్రియ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. పైరవీకారుల మాటలు విన్న అధికారులు చివరకు చేతులు కాల్చుకునే పరిస్థితికి దిగజారిపోయింది. వారం రోజులు గా రగులుతున్న ఈ మంటలు..ప్రస్తుతం పిల్లల తల్లిదండ్రులు రంగంలోకి దిగి ప్రత్యక్ష యుద్ధం చేసే పరిస్థితికి వెళ్లిపోతోంది. సర్దుబాటుపై టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ముందుకొచ్చి ఎంఈఓ ల తప్పిదాలు, అనాలోచిత నిర్ణయాలు, లోపాయికారి ఒప్పందాలపై జిల్లా విద్యాశాఖ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో సర్దుబాటు జాబితాకు నిప్పు మరింత అంటుకుంటోంది. ఇంత జరుగుతున్నా ఎంఈఓలు మాత్రం తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. నిబంధనల మేరకు పనిచేస్తున్న టీచర్లను కుదించి..వెంటనే మరో చోటకు వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా సర్దుబాటు చేసి, పిల్లల జీవితాలను ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకోమ ని సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు టీచర్లను రిలీవ్ చేయడం లేదు. దీంతో చిర్రెత్తిపోతున్న ఎంఈవోలు తమ ఆదేశాలు బేఖాతర్ చేస్తారా అంటూ పరోక్ష బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 109 మంది టీచర్లను సర్దుబాటు చేయగా, ఇందులో అనేక చోట్ల నిబంధనలు ఉల్లంఘించినట్లు సమాచారం. దీనిపై ఐఏఎస్ ఆఫీసర్, జిల్లా విద్యాశాఖ అధికారి నివేదికలను కోరగా, సర్దుబాటు ప్రాసెస్ మాత్రం యథావిధిగా జరిగిపోతోంది.
తెరపైకి పైరవీకారులు
టీచర్ల సర్దుబాటు విషయమై నెలకొన్న గందరగోళ పరిస్థితులను సాక్షి వరుసగా కథనాలను అందిస్తూ భ్రష్టు పట్టిపోతున్న విద్యాశాఖను మేలుకొలిపే ప్రయత్నం చేస్తోంది. సర్దుబాటులో ఆయా పాఠశాలలకు అన్యాయం చేస్తూ పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తున్నారని సహచర టీచర్లు నెత్తి, నోరు మొత్తుకుంటున్నా ఉన్నతాధికారులకు మాత్రం వినిపించడం లేదు. ఇతర పాఠశాలలకు తాత్కాలిక బదిలీతో పాటు సంఘాల్లో పనిచేస్తున్న వారి బడులకు అదనంగా సర్దుబాటు చేసుకున్న ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొంతమంది పైరవీకారులు ఈ జాబితాలో చేతులుపెట్టారనే ప్రచారం వినిపిస్తోంది. పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండి సర్దుబాటులో తగ్గిపోయిన బడుల నుంచి..వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
గండిరామారం యూపీఎస్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
నర్మెట మండలం గండిరామారం ప్రాథమికోన్నత పాఠశాల ఎదుట గురువారం తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. టీచర్ల సర్దుబాటు పేరుతో పిల్లలకు అన్యాయం చేయవద్దని ఆందోళన చేపట్టి పెద్దపెట్టున నినాదాలు చేశారు. యూపీఎస్‌లో గతంలో 40 మంది వరకు విద్యార్థులు ఉండగా, బడిబాటలో మరో 30 మంది కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. ఇందుకుగాను నలుగురు ఎజ్జీటీలు, ఒక స్కూల్ అసిస్టెంట్ పిల్లలకు పాఠాలను బోధిస్తున్నారు. ఇటీవల చేసిన సర్దుబాటులో ఈ పాఠశాలకు చెందిన ఎస్జీటీని ఓ పాఠశాలకు పంపించి, ఇక్కడకు మరో స్కూల్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయున్ని (స్కూల్ అసిస్టెంటు)వేశారు. ఆ పాఠశాలలో పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా టీచర్లు ఉన్నారని, ఎస్‌ఏను రిలీవ్ చేసే పరిస్థితి లేదని హెచ్‌ఎం తేల్చిచెప్పడంతో గందర గోళ పరిస్థితి నెలకొంది. దీంతో గండిరామారం యూపీఎస్ టీచర్‌ను సైతం రిలీవ్ చేయకుండా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. కలెక్టర్ దీనిపై స్పందించి, తమ పిల్లల భవిష్యత్తు ఆగం కాకుండా చూడాలని కోరారు.
పిల్లల భవిష్యత్‌ను ఆగం చేయవద్దంటున్న తల్లిదండ్రులు
ఎంఈవోల తప్పిదాలతో పలు
పాఠశాలలకు అన్యాయం
టీచర్లను రిలీవ్ చేయని హెచ్‌ఎంలు..
చేయాల్సిందే అంటూ ఎంఈఓల హుకుం
ప్రైవేటు బాటపట్టేందుకు సిద్ధమవుతున్న పిల్లలు
అగమ్యగోచరంగా జిల్లా విద్యాశాఖ