
రాఖీ అమ్మకాల జోరు!
జనగామ: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు జరుపుకునే మహోత్తరమైన పండుగ రాఖీ. సోదరీసోదరుల అనురాగం, ఆప్యాయతలకు నిదర్శనమే ఈ పండుగ. రాఖీ పౌర్ణమినే శ్రావణ, జంధ్యాల పౌర్ణమి అని పిలుచుకుంటారు. అన్నా పండగకు వస్తున్నా..అంటూ చెల్లి పలకరింపు కోసం అన్నలు, అక్క ఎప్పుడొస్తుందోనని కంట్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసే తమ్ముళ్లు..ఇలా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని ఈ నెల 9(శనివారం)వ తేదీన ఘనంగా జరుపుకోనున్నారు. పండుగ సమీపించడంతో జనగామ పట్టణంలోని కృష్ణాకళామందిర్, గణేశ్‌వాడ, బస్టాండ్, రైల్వేస్టేషన్, నెహ్రూపార్కు, సిద్దిపేట రోడ్డులో రాఖీల దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి.
ఇళ్లలో మొదలైన సందడి..
రాఖీ పండుగ వచ్చిందంటే ఊరు, వాడ అంతా సందడే. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతీఒక్కరు జరుపుకునే ఈ పండుగతో మార్కెట్ కూడా సందడిగా ఉంటుంది. జనగామ పట్టణంలోని దుకాణాల్లో రకరకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. గతంలో కంటే భిన్నంగా ఈసారి సృజనాత్మకతతో కూడిన రాఖీలు అందుబాటులో ఉన్నాయి. రూ.2 నుంచి మొదలుకుని రూ.250, రూ.300, రూ.500, రూ.1000లకు పైగా వరకు ధరలు పలుకుతున్నాయి. ప్రతిఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకతీతంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు జరుపుకుంటారు. జనగామ జిల్లా కేంద్రంతో పాటు మండలాల పరిధిలో రాఖీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
కొనుగోలుదారులతో దుకాణాల కళకళ
రూ.2 నుంచి మొదలుకుని రూ.వెయ్యికి పైగా ధరలు
రేపు రాఖీ పౌర్ణమి వేడుకలు

రాఖీ అమ్మకాల జోరు!

రాఖీ అమ్మకాల జోరు!