
అప్రమత్తంగా ఉండాలి
జనగామ: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవన ద్రోణి ప్రభావంతో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగ్రం అప్రమత్తమైంది. గురువారం రాత్రి 10.30 గంటలకు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, తదితర అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.. భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో 12 మండలాల పరిధిలో లోతట్టు ప్రాంతాలు, కల్వర్టులు, ప్రమాదకరంగా ఉన్న రహదారులు, పెంకుటిళ్లు, విద్యుత్‌కు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం నిఘా వేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కల్వర్టుల వద్ద జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశారు. జనగామ–నర్మెట ప్రధాన రహదారి గానుగుపహాడ్ తాత్కాలిక మట్టిరోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో భారీ వర్షాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనే భయాందోళన నెలకొంది. అలాగే పాలకుర్తి రూట్‌లో కుందారం, బచ్చన్నపేట– కొన్నె ప్రధాన రహదారి వెంట ఉన్న కల్వర్టులు, జఫర్‌గడ్, రఘునాథనాపల్లి, నర్మెట, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల తదితర మండలాల పరిధిలోని పల్లెలకు వెళ్లే దారులు, మధ్య మధ్యలో వచ్చే కల్వర్టులపై అధికారులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. జిల్లాలో రాత్రి 10 గంటల వరకు కొడకండ్లలో 75 మిల్లీ మీటర్లు, దేవరుప్పులలో 72.3మి.మీ, పాలకుర్తిలో 62.0 మి.మీ, బచ్చన్నపేటలో 19.5 మి.మీ, లింగాలఘనపురంలో 3.8 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు

అప్రమత్తంగా ఉండాలి