
నివేదిక ఇవ్వండి
ఉపాధ్యాయుల సర్దుబాటుపై ఎంఈఓలను ఆదేశించిన అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటులో వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపధ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ సమగ్ర నివేదికను సమర్పించాలని ఎంఈఓలను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో వయోజన విద్యాశాఖ సంచాలకులు ఉషారాణితో కలిసి విద్యా శాఖ జిల్లా అధికారులు, ఎంఈఓలతో విద్యాశాఖ పని తీరుపై సమీక్షించారు. జిల్లాలో ఎంఈఓల నివేదిక ఆధారంగా చేపట్టిన 109 మంది టీచర్ల సర్దుబాటు విద్యాశాఖను కుదిపేస్తోంది. తప్పుడు నివేదికలు, లోపాయి కారి ఒప్పందం మేరకే సర్దుబాటు చేశారని ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదు చేస్తుండగా.. ఇందులో నొక్కింది ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. సర్దుబాటు రగడపై ‘సాక్షి’లో ప్రచురితమవుతున్న వరుస కథనాలు విద్యాశాఖను షేక్ చేస్తుండగా, ఇప్పుడిప్పుడే ఉన్నతాధికారులు స్పందిస్తున్నారు.
ఎంఈఓల తప్పుడు నివేదికలతోనే..
మండలాల నుంచి ఎంఈఓల తప్పుడు నివేదికలతోనే టీచర్ల సర్దుబాటు సమస్య జఠిలంగా మారిపోతుందని టీపీటీఎఫ్ జిల్లా కమిటీ తరఫున అదనపు కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి (ఐఏఎస్) పింకేష్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే సవరించాలని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మండల విద్యాధికారుల(ఎంఈఓ) తప్పుడు రిపోర్టులతోనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. దేవరుప్పుల మండలం గొల్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు తరగతులు కొనసాగుతున్నప్పటికీ, నలుగురు ఉపాధ్యాయుల్లో ఒక భాషా ఉపాధ్యాయుడిని నిబంధనలకు విరుద్ధంగా పొట్టిగుట్ట పీఎస్ తండాకు కేటాయించడం దారుణమన్నారు. అలాగే జిల్లా పరిషత్ కడవెండి పాఠశాలలో జీవశాస్త్రం, సింగరాజుపల్లిలో ఇంగ్లిష్ టీచర్ పదవీ విరమణతో ఏడాదిగా ఖాళీగా ఉన్నప్పటికీ సర్దుబాటులో పట్టించుకోలేదన్నారు. జనగామ పట్టణం జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, పెంబర్తి స్కూల్, చిల్పూరు మండలం చిన్న పెండ్యాల స్కూల్‌తో పాటు మరికొన్ని పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే తప్పుల తడకగా మారిన టీచర్ల సర్దుబాటు జాబితాను పునఃపరిశీలన చేయాలని కోరారు. తప్పుడు రిపోర్టులు సమర్పించిన మండల విద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సంఘ జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్‌రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుశావలి, జిల్లా బాధ్యులు అశోక్, రాజారెడ్డి, లక్ష్మణ్, శ్రీహరి, వజ్రయ్య తదితరులు ఉన్నారు.
ఎంఈఓల అవగాహనా రాహిత్యం
విద్యాశాఖ అధికారులతో సమీక్ష
నిబంధనలు పాటించని
ఎంఈఓలపై టీపీటీఎఫ్ ఫిర్యాదు
ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎంఈఓల అవగాహన రాహిత్యంతో బ్రష్టుపట్టిపోతుందని పలు ఉపాధ్యాయ సంఘాలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. నర్మెట మండలంలోని ఓ పాఠశాలలో టీచర్‌ను మరో స్కూల్‌కు సర్దుబాటు చేయగా, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మా పిల్లల భవిష్యత్‌ను తాకట్టు పెట్టి రిలీవ్ చేయలేమంటూ సదరు బడి బాస్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. సర్దుబాటు ప్రక్రియ పూర్తిగా తప్పుల తడకగా ఉందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. దానిని రద్దు చేసేందుకు మాత్రం సాహసించడం లేదు.

నివేదిక ఇవ్వండి

నివేదిక ఇవ్వండి