
సీటీ స్కాన్ సేవలకు వేళాయె..
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (డీహెచ్)లో సీటీ స్కాన్ సేవల ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. స్కానింగ్ సేవలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ మంగళవారం ఆరా తీసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి నివేదిక అందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషాను ఆదేశించినట్లు తెలిసింది. స్కానింగ్ సేవలు అందుబాటులో వస్తే నిరుపేదల కుటుంబాలకు ఆర్థిక భారం తప్పుతుందనే వివరాలతో కూడిన జాబితాను మంత్రికి అందజేశారు. డీహెచ్‌లో కొత్త సీటీ స్కాన్ యంత్రం బిగించి సుమారు 20 రోజులు గడిచి పోతుంది. అయితే స్కానింగ్ సేవల ప్రారంభానికి రెడీగా ఉన్నప్పటికీ, సంబంధిత శాఖ మంత్రి పర్యటన ఖరారు కావాల్సి ఉంది. గత ఎనిమిది సంవత్సరాల క్రితం మూలన పడిన సీటీ స్కాన్ సేవల పునఃప్రారంభానికి సాక్షి అనేక కథనాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. సాక్షి కథనంతో మొట్ట మొదటిసారి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ్మ స్పందించారు. సంబంధిత రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను అలర్ట్ చేసి, స్కానింగ్ యంత్రం కొనుగోలు కోసం అవసరమైన బడ్జెట్ కేటాయించడంతో ప్రాసెస్ మొదలైంది. డబ్బులు చెల్లించిన నెలన్నర తర్వాత మిషన్ డీహెచ్‌కు చేరుకోగా, 20 రోజుల క్రితం ప్రత్యేక గదిలో కార్పొరేట్ స్థాయిని తలదన్నేలా దానిని అమర్చారు. మంత్రి సమయం ఇచ్చిన వెంటనే.. రెండు, మూడు రోజుల్లో సీటీ స్కాన్ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఐదు జిల్లాల నుంచి..
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి జనగామతో పాటు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వరంగల్, సూర్యాపేట జిల్లాల సమీప పరిధిలోని ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడకు వస్తుంటారు. మహానేత వైఎస్‌ఆర్ హయాంలో నిరుపేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించాలనే తపనతో నాటి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేక చొరవతో సీటీ స్కాన్ సేవలను డీహెచ్‌లో ప్రారంభించారు. ఈ సేవలు అందుబాటులోకి రావడంతో పేద కుటుంబాలపై కొంతమేర ఆర్థిక భారం తగ్గింది. స్కాన్ యంత్రం మరమ్మతు రావడం, దానికి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడడంతో నిధుల లేమితో మూలన పడేశారు. దీంతో పేదలకు అవసరమైన సమయంలో సీటీ స్కాన్ కోసం లోకల్‌తో పాటు హైదరాబాద్, హనుమకొండలోని ప్రైవేట్ సెంటర్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించడంతో మంత్రి స్పందించడంతో... ఇన్నాళ్లకు స్కానింగ్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం కలిగింది. సేవలు ప్రారంభమైన తర్వాత పేదలకు సేవలందించే క్రమంలో సాంకేతిక సమస్యలు రాకుండా పర్యవేక్షణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. సీటీ స్కాన్ సేవలను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు.
త్వరలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభం!
వివరాలు అందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా
‘సాక్షి’ చొరవతో పునఃప్రారంభం