టీచర్లకు యాప్‌ కష్టాలు! | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు యాప్‌ కష్టాలు!

Aug 4 2025 3:55 AM | Updated on Aug 4 2025 3:55 AM

టీచర్

టీచర్లకు యాప్‌ కష్టాలు!

పలు పాఠశాలల్లో నెట్‌వర్క్‌, సర్వర్‌ సమస్యతో ఇబ్బందులు

జనగామ: ప్రభుత్వం సర్కారు బడుల్లో అమలు చేస్తున్న ఫేషియల్‌ అటెండెన్స్‌ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) టీచర్లకు కొత్త కష్టాలు తెచ్చి పెట్టింది. అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్న ఉపాధ్యాయులకు మునుపటిలా అనుకూల పరిస్థితి కనిపించడం లేదు. ముఖ చిత్రం ద్వారా అటెండెన్స్‌ ప్రవేశ పెట్టడంతో ఒక్క సెకండ్‌ ఆలస్యం జరిగినా.. అందులో నమోదవుతుంది. దీంతో టీచర్లు ఒక్క నిమిషం ముందుగానే బడిలో ఉండే పరిస్థితి నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి అప్‌ అండ్‌ డౌన్‌ చేసే వారికి కష్టంగానే చెప్పుకోవచ్చు. పిల్లల ఉన్నత చదువుల కోసం ఇన్నాళ్లు అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్న టీచర్లు జిల్లా హెడ్‌ క్వార్టర్‌ మకాం మార్చేందుకు పలువురు టీచర్లు ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్‌,

హనుమకొండ నుంచి..

జిల్లాలో 459 పాఠశాలలు (కేజీబీవీ, మోడల్‌, యూఆర్‌ఎస్‌ కలుపుకుని) ఉండగా, 2,773 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో లోకల్‌గా 800 మంది వరకు జిల్లా కేంద్రంలో నివాసం ఉండగా స్టేషన్‌ఘన్‌పూర్‌, జఫర్‌గఢ్‌, చిల్పూరు, రఘునాథపల్లి, పాలకుర్తి పరిధిలోని పాఠశాలలకు కొంతమంది ఉపాధ్యాయులు హనుమకొండ నుంచి అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్నారు. బచ్చన్నపేట, తరిగొప్పుల, నర్మెట, జిల్లా హెడ్‌ క్వార్టర్‌కు సుమారు 8 నుంచి 9 వందల మంది సికింద్రాబాద్‌, కూకట్‌పల్లి, చింతల్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ (హైదరాబాద్‌) తదితర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తుంటారు. మండల హెడ్‌ క్వార్టర్స్‌కు చేరుకున్న తర్వాత మెజార్టీ టీచర్లు అక్కడ నుంచి 5 నుంచి 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో గత కొంత కాలంగా విద్యార్థులకు చేస్తున్న ఫేషియల్‌ అటెండెన్స్‌.. ఆగస్టు 1వ తేదీ నుంచి ఉపాధ్యాయులకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05, సాయంత్రం 4.15 గంటల తర్వాత రోజుకు రెండు సార్లు స్కూల్స్‌ ఏరియాలో టీచర్లు యాప్‌లో అటెండెన్స్‌ వేయాల్సి ఉంటుంది.

ఒక్క సెకండ్‌ ఆలస్యం జరిగినా...

ప్రభుత్వ టీచర్లకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం అమలులోకి వచ్చిన తర్వాత స్కూల్‌ సమయ పాలనలో మరింత ఖచ్చితత్వం పెరిగింది. పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు యాప్‌లో అటెండెన్స్‌ వేసే సమయంలో ఒక్క సెకండ్‌ ఆలస్యం జరిగినా అందులో నమోదవుతుంది. దీంతో నెలలో ఎన్ని నిమిషాలు, గంటలు, అనే వివరాలు కాంప్లెక్స్‌ నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఇట్టే తెలిసి పోతుంది. దీంతో అటెండెన్స్‌ నమోదు ఆధారంగా వేతనాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి అప్‌ అండ్‌ డౌన్‌ చేసే టీచర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. తెల్లవారు 5 గంటలకు ఇంటి బయలు దేరి.. రాత్రి 8 గంటల వరకు చేరుకునే పరిస్థితులతో జనగామ జిల్లా హెడ్‌ క్వార్టర్‌కు మారేందుకు నిర్ణయం తీసుకోవడంలో మెజార్టీ టీచర్లు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. సమయ పాలన పాటించేందుకు జనగామలో టులెట్‌ బోర్డుల కోసం ఆరా తీస్తున్నారు.

లొకేషన్‌ పరిధి

పెంచాలని..

అప్‌ అండ్‌ డౌన్‌కు స్వస్తి

జిల్లాలో 2,773 మంది ఉపాధ్యాయులు

ఏక కాలంలో ఓపెన్‌ చేయడంతో..

రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ఉపాధ్యాయుల ముఖ గుర్తింపు హాజరు విధానం తీవ్రమైన బాలారిష్టాలతో సాగుతోంది. నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్య, సర్వర్‌ సతాయింపులతో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ వేసే సమయంలో ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాల ఆవరణను జీపీఎస్‌తో అను సంధానం చేయడంతో..సెల్‌ సిగ్నల్‌ వచ్చినా, రాకున్నా అక్కడే ఉండి ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫోన్‌ ద్వారా హాజరు తీసుకున్నప్పటికీ ఫొటో డిస్‌ప్లే కాకపోవడం, ఉన్నతాధికారుల డేటా నమోదులో సైతం కనిపించక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ కోసం సైట్‌ ఓపెన్‌ చేయడంతో నెట్‌వర్క్‌లో ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి పోతుంది. ఫొటోను అప్‌ లోడ్‌ చేసే సమయంలో ఆఫ్‌ క్వాలిటీకి కుదించితే కొంతవరకు ఈ సమస్య తీరుతుందనే భావనను వ్యక్త పరుస్తున్నారు. ఐఫోన్‌ (ఆపిల్‌) ఫోన్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ పని చేసే విధంగా చూడాలనే డిమాండ్‌ సైతం వినిపిస్తుంది. సాంకేతిక సమస్యను అధికమించే వరకు అటెండెన్స్‌ నమోదులో గ్రేస్‌ పిరియడ్‌ ఉండే విధంగా నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.

మారుమూల ప్రాంతాల్లో సెల్‌ సిగ్నల్‌ కష్టంగా మారిన సమయంలో స్కూల్‌ ఆవరణ నుంచి కొద్ది దూరం వెళ్లి అటెండెన్స్‌ వేసేలా పిన్‌ లొకేషన్‌ పరిధి పెంచాలనే విన్నపాలు పెరుగుతున్నాయి. సాంకేతిక సమస్యలతో టీచర్స్‌ మొబైల్స్‌లో అటెండెన్స్‌ మార్కు కనిపిస్తున్నా, జిల్లా వరకు వచ్చే సరికి గైర్హాజరైనట్లుగా చూపిస్తుందనే ప్రచారం ఉంది. చెక్‌ ఇన్‌ కొరకు అటెండెన్స్‌ తీసుకున్న తర్వాత ఫొటో కనిపించక పోవడంతో, రెండవ సారి ఫేస్‌ అటెండెన్స్‌తో చెక్‌ ఇన్‌–చెక్‌ అవుట్‌ అని ఒకేసారి చూపిస్తుండడంతో టీచర్లు టెన్షన్‌ పడుతున్నారు. ఫేషియల్‌ అటెండెన్స్‌ తీసుకునే సమయంలో ఉత్పన్నమవుతున్న సాంకేతిక సమస్యను నివారించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

టీచర్లకు యాప్‌ కష్టాలు!1
1/1

టీచర్లకు యాప్‌ కష్టాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement