
పానీ.. పంటకు హాని!
జనగామ: ప్రస్తుతం కురుస్తున్న అధిక వర్షాలతో పంట ఎర్రబడి దిగుబడి తగ్గిపొయే ప్రమాదం ఉంది. ముసురు వర్షాలు తగ్గిన తర్వాత రైతులు వివిధ పంటలకు సంబంధించి యాజమాన్య పద్ధతులను పాటించాలని భువనగిరి ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.అనిల్ కుమార్ తెలిపారు. జిల్లాలోప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, పెసరతో పాటు కూరగాయల పంటలు సాగు చేశారన్నారు. తుఫాను ప్రభావంతో ఇంకా కొద్ది రోజుల పాటు వర్ష సూచనలు ఉన్న కారణంగా తాత్కాలికంగా పురుగు లేదా కలుపు మందుల పిచికారీ వాయిదా వేసుకోవాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటలకు యాజమాన్య పద్ధతులు ఆయన మాటల్లోనే.
వరిలో నీటి కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి
పొలంలో నిలిచిన అధిక నీటిని బయటకు మళ్లించే విధంగా కాల్వలను ఏర్పాటు చేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ బూస్టర్ డోస్‌గా వేసుకోవాలి. అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో వరిలో అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు ఒక లీటరు నీటికి 1.5 మిల్లీ లీటరు ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మి.లీ. కాసుగా మైసిన్ చొప్పున కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. ముదురు నారు నాటే సమయంలో నారు కొనలను తుంచి నాటితే ఫలితం ఉంటుంది. వరిలో ప్రస్తుతం జింక్ దాతులోపం నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేస్తే సరిపోతుంది. వరి నారుమడులు వరద ముంపునకు గురై ఎర్రబడి నారు చనిపోతే, ప్రత్యామ్నాయంగా స్వల్పకాలిక (120 రోజుల) రకాలైన కె. ఎన్.ఎం–118, ఆర్.ఎన్.ఆర్–29325, ఆర్.ఎన్.ఆర్– 28361, డబ్ల్యూజీఎల్ –915 వంటి వరి రకాలు ఎంపిక చేసుకొని ఎకరానికి 12 కిలోల మొలకెత్తిన విత్తనాన్ని దుక్కి, దమ్ము చేసిన పొలంలో డ్రంసీడర్‌తో లేదా నేరుగా వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలి.
పత్తిలో సస్యరక్షణ చర్యలు
పత్తి చేనులో నీరు నిల్వ ఉండకుండా నీటి కాల్వల ద్వారా బయటకు పంపించి మొక్కలు చనిపోకుండా చూడాలి. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత పైపాటుగా ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను బూస్టర్ డోస్‌గా వేయాలి. పత్తిలో అధిక వర్షాలతో మెగ్నీషియం ధాతువు లోపం రావడానికి అవకాశం ఉంటుందని, దీని నివారణకు లీటరు నీటికి 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ చొప్పున కలిపి పిచికారీ చేస్తే సరి పోతుందన్నారు.
కలుపు నివారణకు..
పత్తి మొలకెత్తిన నెల రోజులకు చేనులో పెరిగే లేత గడ్డి, వెడల్పు ఆకు రకం కలుపు నివారణకు ఎకరానికి 400 మి.లీ పైరిథయోబాక్ సోడియం 8 శాతం, క్విజలోఫాప్ ఇథైల్ 2 శాతం మిశ్రమాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పత్తిలో పూత, పిందె, కాయ రాలుట నివారించడానికి లీటరు నీటికి 10 గ్రాముల 13:0:45 (పొటాషియం నైట్రైట్) చొప్పున కలిపి పంటపై పిచికారీ చేయాలి. ఎండు తెగులు, వేరు కుళ్లు నివారణకు 1 లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బెండాజిమ్ చొప్పున కలిపి మొక్కల మొదల్ల వద్ద స్ప్రేయర్ నాజిల్ తీసి ఆశించిన మొక్కలకు, చుట్టుపక్క ఉన్న మొక్కలకు పోయాలి.
ముసురు వానతో పంటల్లో నిలిచిన నీరు
సస్యరక్షణ చర్యలు చేపట్టి కాపాడుకోవాలి
భువనగిరి ఏరువాక కేంద్రం
ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనిల్‌కుమార్
మొక్కజొన్న పంటలో మెళకువలు
ముసురు వర్షాలతో భాస్వరం లోపం ఏర్పడి మొక్కజొన్న ఉదారంగులోకి మారుతుంది. వర్షాలు తగ్గిన తర్వాత లీటరు నీటికి 10 గ్రాముల 19:19:19 లేదా 20 గ్రాముల డీఏపీ చొప్పున కలిపి పిచికారీ చేస్తే పంటకు మేలు జరుగుతుంది.

పానీ.. పంటకు హాని!

పానీ.. పంటకు హాని!

పానీ.. పంటకు హాని!