
పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య
జనగామ: తెలంగాణ ప్రభుత్వం 2025–26 విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ పాఠశాలల నిర్వాహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ, మార్గదర్శకాలను విడుదల చేసింది. వచ్చే విద్యాసంవత్సరంలో (2026–27) 1వ తరగతిలో అడ్మిషన్ల సంఖ్యను పెంచేందుకు అర్హత ఉన్న చిన్నారులను ఈ ఏడాదిలో ప్రీ ప్రైమరీ విభాగంలో చేర్చుకోనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 15 పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. పిల్లల ప్రవేశ సమయంలో వయస్సు, నివాస రుజువుతో సహా అవసరమైన అన్ని పత్రాలను ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరణను నిర్ధారించుకోవాలి. అడ్మిషన్లకు సంబంధించి రిజిస్టర్‌లో నమోదు చేసిన వెంటనే యూడైస్ పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలి. అణగారిన వర్గాలకు చెందిన పిల్లలతో పాటు ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారులను గుర్తించి, డబ్ల్యూడీసీడబ్ల్యూ, ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయి సిబ్బంది సమన్వయంతో ప్రభుత్వ నిబంధనల మేరకు సమగ్ర సమాచారం తీసుకోవాలి.
నిర్వహణ ఇలా...
ప్రీ ప్రైమరీ పాఠశాల నిర్వహణకు పాఠశాల ప్రాంగణంలో ప్రధానోపాధ్యాయుడు ఒక ప్రత్యేక తరగతి గదిని కేటాయించాలి. వెంటిలేషన్, ఫర్నీచర్‌తో పా టు పిల్లల భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా, ఆ కర్షణీయంగా తీర్చిదిద్దాలి. తరగతి గది చుట్టూ స్వ చ్ఛమైన వాతావరణం కల్పించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల కాలక్షేపం కోసం ఇండోర్, అవుట్ డోర్‌లో ఆడుకునేందుకు ఆట వస్తువులను అందుబాటులో ఉంచాలి. ప్రీ ప్రైమరీలో పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీ సమన్వయంతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీపై ఉంటుంది.
ప్రీ ప్రైమరీలో రెండు పోస్టులు
ప్రీ ప్రైమరీ స్కూల్ నిర్వహణకు టీచర్, ఆయా రెండు పోస్టులను మంజూరు చేశారు. ప్రీ ప్రైమరీ టీచర్ కనీస అర్హత ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన బాల్య విద్య లేకుంటే ప్రాథమిక బోధనలో అర్హతలు ఉంటే సరిపోతుంది. ఆయా పోస్టుకు కనీస 7వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. గ్రామ నివాసి అయి ఉండాలి. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి అభ్యర్థులు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉన్న వారు అర్హులు. కలెక్టర్ అధ్యక్షతన అదనపు కలెక్టర్ (వైస్ చైర్మన్), డీఈఓ (కన్వీనర్), కలెక్టర్ నామినేటెడ్ చేసిన ఒక సభ్యుడితో కూడిన జిల్లా కమిటీ పర్యవేక్షణలో టీచర్, ఆయాలను ఎంపిక చేస్తారు.
ఎన్‌సీఈఆర్‌టీ సూచించిన పాఠ్యాంశాలు..
నేషనల్ కరికులం ప్రేమ్ వర్క్ ఫర్ ది ఫౌండేషనల్ స్టేజ్‌తో అనుసంధానం చేసిన ఎన్‌సీఈఆర్‌టీ సూచించిన పాఠ్యాంశాలను బోధించాలి. ఉపాధ్యాయుల చేతి పుస్తకాలు, ఇతర బోధనా, సామాజిక, భావోద్వేగ, భాషా అభివృద్ధిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి.
జిల్లాలో 15 ప్రీ ప్రైమరీ స్కూల్స్
జిల్లాలో రెండో విడతలో 15 ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు 60 ప్రీ ప్రైమరీ పాఠశాలల వచ్చే అవకాశం ఉన్నట్లు భావించిన విద్యాశాఖ అధికారులు, బడిబాటలో ఆ మేరకు అడ్మిషన్లను పెంచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం 90 మందికి పైగా నాలుగు సంవత్సరాల చిన్నారులు సర్కారు బడిలో చేరగా, 15 మాత్రమే ప్రీ ప్రైమరీ మంజూరు కావడంతో టీచర్లలో ఒకింత టెన్షన్ పట్టుకుంది. జిల్లాలో పోచన్నపేట, బచ్చన్నపేట, కొడవటూరు, కోలుకొండ, లక్ష్మీతండా, కొండాపూర్, కొత్తపల్లి, బోనకొల్లూరు, గూడూరు, వాచ్చ్యాతండా, ధర్మగడ్డతండా, దాసన్నగూడెం ప్రాథమిక పాఠశాల, సూరారం, సోలీపూర్, నెల్లుట్ల ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రైమరీ స్కూల్స్‌కు ఎంపికయ్యాయి.
జిల్లాలో 15 స్కూల్స్ ఎంపిక
వచ్చే విద్యాసంవత్సరంలో
అడ్మిషన్లను పెంచే లక్ష్యంగా..
నాలుగేళ్లు నిండిన చిన్నారులకు
అవకాశం