
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి
● జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి
నర్మెట: వర్షాలు కురుస్తున్నందున పంచాయతీలు పారిశుద్ధ్య నిర్వాహనపై ప్రత్యేక దృష్టి సారించాలని, వైద్య సిబ్బంది విషజ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి నాగపురి స్వరూపారాణి అన్నారు. నర్మెట గ్రామ పంచాయతీని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వలు ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరవింద్ చౌదరి, వైద్యాధికారి ఉదయ్ కిరణ్, కార్యదర్శి కందకట్ల శ్రీధర్, బిల్ కలెక్టర్ చిర్ర వెంకట్ రెడ్డి, ఏఎన్‌ఎంలు కుల్సుం సుల్తానా బేగం, కరుణ, ఆశలు శ్వేత, మంగ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.