
లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలి
రఘునాథపల్లి: ఇందిరమ్మ లబ్ధిదారుల నిర్మాణ వివరాలను రెండు రోజుల్లోగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పోర్టల్‌లో నమోదు చేయాలని జెడ్పీ సీఈఓ మాధురిషా.. అధికారులు, పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై గురువారం మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా ఇళ్ల నిర్మాణ వివరాలను ఎంపీడీఓ శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. మండలంలో 553 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, సాంకేతిక సమస్యలతో పీఎంజీవై పోర్టల్‌లో నమోదు కావడం జాప్యం జరుగుతుందని ఎంపీడీఓ వివరించారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం రెండు రోజుల్లో పోర్టల్‌లో నమోదు పూర్తి చేయాలని మాధురిషా చెప్పారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా పంచాయతీ కార్యదర్శులు, అధికారులు ప్రోత్సహించాలన్నారు. వర్షం కురిసినప్పుడు స్లాబ్ నుంచి కార్యాలయంలోకి నీరు కారుతుందని సీఈఓకు ఎంపీడీఓ తెలియజేయగా.. కార్యాలయం గదులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీఓ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ రమేష్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
జెడ్పీ సీఈఓ మాధురిషా