విలీనం ఇంకెప్పుడు? | - | Sakshi
Sakshi News home page

విలీనం ఇంకెప్పుడు?

Jul 22 2025 7:53 AM | Updated on Jul 22 2025 8:08 AM

విలీనం ఇంకెప్పుడు?

విలీనం ఇంకెప్పుడు?

జనగామ: పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాల విభజన చేసి పదేళ్లు గడిచి పోతున్నా, వ్యవసాయ మార్కెట్‌ల విలీన ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. జిల్లాలోని మార్కెట్‌ చెక్‌ పోస్టుల ఆదాయం, పొరుగున ఉన్న సిద్దిపేట ఖజానాకు చేరుకుంటుంది. దీంతో జనగామ వ్యవసాయ మార్కెట్‌ లక్షల్లో ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది. చెక్‌పోస్టుల విలీనంపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు పట్టింపు లేకుండా పోయింది. వాస్తవంగా బచ్చన్నపేట జనగామ జిల్లాలో ఉన్నప్పటికీ, చేర్యాల మార్కెట్‌కు అనుసంధానంగా పని చేయడం హాస్యాస్పదం. ఈ విషయమై గతంలో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ దృష్టికి తీసుకు వెళ్లినా.. పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడి అధికారులు కూడా వారిపై ఒత్తిడి తీసుకు రాకపోవడంతో సొంత జిల్లా ఆదాయాన్ని పక్కా జిల్లాకు బంగారుపల్లెంలో పెట్టి మరీ అప్పగించేస్తున్నారు.

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ నిర్వహణ విచిత్రంగా మారింది. ఆదాయ మార్గాలను పెంచుకోవాల్సిన అధికారులు, గత ప్రభుత్వం నుంచి ఉన్నవాటిని వదులుకునే పరిస్థితి నెలకొంది. సొంత జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల ఆదాయాన్ని పొరుగు జిల్లా పట్టుకుని పోతుంటే కళ్లప్పగించి చూస్తున్నారు. ఇదేంటని అడిగిన వారికి, ప్రభుత్వమే చూసుకుంటుందని చేతులు దులుపు కుంటున్నారు. జిల్లాలోని జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ల పరిధిలో 6 చెక్‌ పోస్టులు ఉన్నాయి. ఇందులో జనగామ నియోజకవర్గంలోని బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల చెక్‌ పోస్టులు మాత్రం సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్‌కు అనుసంధానంగా పని చేస్తున్నాయి. అత్యధికంగా కాసులు కురిపించే ఈ మూడు చెక్‌ పోస్టుల విలీనంపై జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదు.

ఏడాదికి రూ.40 లక్షల పైమాటే...

జిల్లాలో జనగామ, వెలిశాల (కొడకండ్ల), మొండ్రాయి (కొడకండ్ల), సింగరాజుపల్లి (కొడకండ్ల), స్టేషన్‌ఘన్‌పూర్‌, గూడూరు (పాలకుర్తి) మండలాల పరిధిలో 7 చెక్‌ పోస్టులు ఉన్నాయి. వీటిపై 2023–24లో రూ.1.34కోట్ల ఆదాయం రాగా, 2024–25లో రూ.73.88 లక్షలకు తగ్గిపోయింది. జనగామ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్న మూడు చెక్‌పోస్టుల ద్వారా రూ.40 లక్షలకు పైగానే రాబడి ఉంది. జిల్లాల పునర్విజన జరిగిన సమయంలో, వీటి విలీనంపై ఎవరూ కూడా పట్టించుకోక పోవడంతో సిద్దిపేట మార్కెట్‌ ఖజానాకు అదనపు ఆదాయం కలిసొచ్చింది.

రూ.లక్షల రాబడి ఎందుకంటే..

మహారాష్ట్ర–కాకినాడ ప్రధాన హైవేలో 24 గంటల పాటు పనిచేసే చెక్‌పోస్టుల్లో బచ్చన్నపేట ఒక్కటి. ప్రధాన హైవేలు బైపాస్‌లుగా మారడం, నిఘా లేకపోవడంతో సరుకు లోడుతో వచ్చే వందలాది వాహనాలు, చేర్యాల లేదా బచ్చన్నపేట చెక్‌పోస్టుల పరిధిలో పన్నులు చెల్లించి రశీదు తీసుకుంటారు. లోకల్‌గా సరుకుల కొనుగోలుపై వచ్చే ఆదాయం కన్నా, రోడ్డు రవాణా పరంగా వచ్చే కలక్షన్లే ఎక్కువ. బచ్చన్నపేట చెక్‌పోస్టు 2005 నుంచి 2022 వరకు ఏటా రూ.25 నుంచి రూ.55 లక్షలకు పైగానే రికార్డు వసూళ్లు చేసింది. 2023–24లో రూ.19.27 లక్షలు, 2024–25లో రూ.18.24 లక్షల మేర ఆదాయం సమకూరింది. ఇంత పెద్ద మొత్తంలో రాబడి ఉన్నప్పటికీ బచ్చన్నపేటతో పాటు పక్కనే ఉన్న నర్మెట, తరిగొప్పుల చెక్‌పోస్టులను జనగామ జిల్లాలో కలుపుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమయ్యారనే చెప్పుకోవచ్చు. కాగా చెక్‌పోస్టుల విలీనంపై రైతు సంఘాలు సైతం డిమాండ్‌ చేస్తున్నాయి. బచ్చన్నపేట మార్కెట్‌ను జనగామలో విలీనం చేసేందుకు అధికార పార్టీ నాయకులు దృష్టి సారించాలని కోరుతున్నారు. విలీనం జరిగితే చెక్‌పోస్టుపై మరింత నిఘా పెరగడంతో పాటు ఆదాయం కూడా అంతే మొత్తంలో పెరుగుతుందని భావిస్తున్నారు.

బచ్చన్నపేట మార్కెట్‌ చెక్‌పోస్టు ఆదాయం సిద్దిపేట జిల్లాకు..

విభజన జరిగి పదేళ్లయినా..

పట్టించుకోని అధికారులు

రూ.లక్షల్లో ఆదాయం కోల్పోతున్న

జనగామ వ్యవసాయ మార్కెట్‌

విలీనం చేస్తే

నూతన పాలక మండలికి అవకాశం

నూతన మార్కెట్‌

పాలకమండలికి అవకాశం

బచ్చన్నపేట మార్కెట్‌ను జనగామ జిల్లాలో విలీనం చేసి, నూతన మార్కెట్‌ పాలక మండలిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే నామినేటెడ్‌ పదవుల కోసం ఎదురు చూసే వారికి సువర్ణావకాశంగా చెప్పుకోవచ్చు. నూతన పాలక మండలి ఏర్పాటు వైపు దృష్టి సారిస్తే, రాబడికి రాబడి, పదవులకు పదవులు రెండు కలిసి వచ్చే అవకాశం కలుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement