
గోదావరి జలాలతో చెరువులు నింపాలి
జనగామ రూరల్: గోదావరి జలాలతో జనగామ ప్రాంతంలోని చెరువులు, కుంటలు నింపాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందునాయక్ డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్ మాట్లాడారు. వర్షాలు లేక విత్తనాలు పుచ్చి పోయాయని, ఒక్కో రైతు రూ. పది వేల వరకు నష్టపోయారని, ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 9 రిజర్వాయర్లు 723 చెరువులు కుంటలు ఉన్నాయని, ఈ చెరువులు, కుంటలను పూర్తిస్థాయిలో నింపి ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి పోతుకనూరి ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు మంగ బీరయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఉర్సుల కుమార్, కర్రి సత్తయ్య, రాజు, రైతులు పాల్గొన్నారు.