జనగామ రూరల్: వివిధ యాజమాన్యాల కింద కొనసాగుతున్న పాఠశాలలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకువచ్చి కామన్ స్కూల్ విద్యావిధానాన్ని అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉమాపతి కార్యాలయంలో టీపీటీఎఫ్ జిల్లా సబ్ కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు ఎన్‌ఎన్ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యా య విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, ప్ర భుత్వ పాఠశాలలన్నింటినీ సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల, బదిలీల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల వివిధ రకాల బిల్లులను విడుదల చేయాలని, వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు ఎన్ ఎన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలన్నింటికీ పదివేల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంకుషావలి, రాష్ట్ర కౌన్సిలర్ కుర్రంల యాదగిరి, సత్యనారాయణ రెడ్డి, వజ్రయ్య, రాజారెడ్డి, లక్ష్మణ్ జి, రాజేందర్, ప్రభాకర్, శారద, కవిత తదితరులు పాల్గొన్నారు.