
విద్యార్థులు లక్ష్యంతో చదవాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రతిఒక్కరూ విద్యార్థి దశలోనే భవిష్యత్ లక్ష్యాలను నిర్ధేశించుకుని లక్ష్యసాధనకు ప్రణాళికయుతంగా చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న అన్నారు. మండలంలోని ఛాగల్లు ఉన్నత పాఠశాలను డీఈఓ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని రికార్డులు, రిజిస్టర్లు, టీచర్ల డైరీలు, బేస్ లైన్ పరీక్షల వివరాలు, పాఠ్య ప్రణాళికలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధన ఎలా ఉంది, పాఠ్యాంశాలు సరిగా అర్థం అవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, వినయం కలిగి ఉండాలని, ఉన్నత చదువుతో సమాజంలో సరైన గుర్తింపు లభిస్తుందన్నారు. విద్యార్థులు ఎలాంటి దురలవాట్లకు గురికావద్దని, చదువుపైనే శ్రద్ధ వహించాలన్నారు. ఉపాధ్యాయుల సూచనల మేరకు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. వంట చేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ కొమురయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.
డీఈఓ భోజన్న