
83.29శాతం
మొక్కల
సంరక్షణ
జనగామ: అటవీ ప్రాంతంలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక ఫోకస్ సారిస్తున్నారు. నాటిన ప్రతీ మొక్కను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ జిల్లాలో గడిచిన తొమ్మిదేళ్ల లెక్కలను పరిశీలిస్తే అటవీ ప్రాంతం కేవలం 0.5 శాతం మాత్రమే పెరిగింది. 2015కు మందు ఒక శాతం ఫారెస్ట్ ఏరియా ఉండగా... డబుల్ చేసేందుకు నాటి నుంచి నేటి వరకు కష్టపడినా.. ఫలితం కనిపించడం లేదు. మండలాల పరిధిలో ఎక్కువగా అటవీ ప్రాంతం లేకపోవడంతో అధికారులు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోతున్నారు. ఒక్కో మొక్కను పెంచి పెద్ద చేసి, నాటే వరకు రూ.86 ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో పచ్చదనం ఏటా అటవీ ప్రాంతం విస్తీర్ణం పెరుగుదల తదితర అంశాలపై సాక్షి ప్రత్యేక కథనం.
తొమ్మిదేళ్లు..4.83 కోట్ల మొక్కలు
జనగామ ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించిన తర్వాత అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో అతి తక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లాలో జనగామ ఒకటి. కేవలం ఒకే ఒక్క అటవీ ప్రాంతంతో ఉన్న జిల్లాలో రెండు నుంచి మూడుకు పెంచాలని నాటి కలెక్టర్ దేవసేన నుంచి ప్రస్తుత జిల్లా బాస్ రిజ్వాన్ బాషా వరకు కృషి చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ 0.5 శాతం మాత్రమే పెంచగలిగారు. ఎక్కువగా ఫారెస్ట్ ఏరియా లేకపోవడం, సాగు పెరగడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 2016 నుంచి 2024 వరకు 5.80 కోట్ల మొక్కల లక్ష్యం కాగా 4.83 కోట్లు నాటారు. ఇందులో 83.29 శాతం మేర మొక్కలను సంరక్షించగలిగారు.
2.18 లక్షల హెక్టార్ల భౌగోళిక ప్రాంతం
జనగామలో 2,18,750 హెక్టార్ల భౌగోళిక ప్రాంతం ఉండగా, ఇందులో లింగాలఘణపురం, జనగామ, కొడకండ్ల మినహా 9 మండలాల పరిధిలో 3,357.03 హెక్టార్ల మేర అటవీ ప్రాంతం (1.05 శాతం) విస్తరించి ఉంది. జనగామ, నర్మెట మండలం వె వెల్దండ గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఉండగా, బచ్చన్నపేట మండలం మన్‌సాన్‌పల్లిలో త్వరలోనే ప్రారంభించనున్నారు. వీటి పరిధిలో 1.20లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండగా, ఇటీవల పురపాలికలోని 30 వార్డుల్లో నాటేందుకు 12,500 మొక్కలను వెల్దండ, మరో 10 వేలను జనగామ నర్సరీ నుంచి సరఫరా చేశారు. మొక్కను పెంచేందుకు రూ.12, నాటేందుకు (అన్ని కలుపుకుని) రూ.74 మేర మొత్తంగా రూ.86 ఖర్చు చేస్తున్నారు. ఈ లెక్కన తొమ్మిదేళ్లలో రూ.4.15 కోట్ల మేర ఖర్చు చేయగా, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. వందశాతం మొక్కలు నాటే సమయంలో ఇందులో ఎండి, విరిగి పోవడం, చెదలు పట్టడంతో 10 నుంచి 20 శాతం మేర నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. వీటి స్థానంలో కొత్త మొక్కలను నాటి వందశాతం ఫలితాలను తీసుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నారు. 10వేల మొక్కలకు ఒక వాచర్‌ను ఏర్పాటు చేసి రెండేళ్ల పాటు మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగిస్తున్నారు. ప్రస్తుత వనమహోత్సవంలో 2025 వార్షిక టార్గెట్ అన్ని శాఖలు కలుపుకొని 33 లక్షలు ఉండగా అటవీశాఖ 14,400 మొక్కలు నాటాల్సి ఉంది.
రూ.4.15 కోట్ల ఖర్చు
జిల్లాలో 3,357.03 హెక్టార్లలో
అటవీ ప్రాంతం
తొమ్మిదేళ్లలో 0.5 శాతం పెరుగుదల
ఈ సంవత్సరం లక్ష్యం 14,400
ఒక్కో మొక్కకు రూ.86 ఖర్చు
బచ్చన్నపేట
188.82
మండలాల వారీగా
అటవీ ప్రాంతం
(హెక్టార్లలో)
రఘునాథపల్లి 605.48
పాలకుర్తి
1,107.75
మొత్తం 3357.03
నర్మెట 250.12
స్టేషన్‌ఘన్‌పూర్ 924.30
చిల్పూరు,
తాటికొండ,
జఫర్‌గఢ్ 183.45
తరిగొప్పుల 97.11
జిల్లాలో అటవీ విస్తీర్ణం
జిల్లా భౌగోళిక ప్రాంతం: 2,18,750 హెక్టార్లు
అటవీ ప్రాంతం: 3,357.03హెక్టార్లు
అటవీ శాతం: 1.05శాతం
మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ
జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. 12 మండలాల పరిధిలో పెద్దగా అటవీ ప్రాంతం లేదు. ప్రస్తుతం 3,357.03హెక్టార్ల పరిధిలో మాత్రమే పారెస్ట్ ఏరియా ఉండగా, పొలం గట్లు, చెరువు కట్టలు, వ్యవసాయ క్షేత్రాలు, ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటి కొంతమేర అటవీ ప్రాంతాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందు కోసం రైతులను కూడా ప్రోత్సహిస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు వనమహోత్సవం ప్రోగ్రాంలో అటవీ శాఖ ప్రధాన భూమిక పోషిస్తోంది. 9 సంవత్సరాల్లో మంచి ఫలితాలు సాధించి, 2025 వార్షిక సంవత్సరానికి 14,400 మొక్కల పెంపకం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. నాటిన మొక్కలు వాడి పోవడం, ఎండటం, చెదలు పట్టకుండా మందులు చల్లుతూ వాచర్ పర్యవేక్షణలో నిత్యం దృష్టి సారిస్తున్నాం. ఒకవేళ 10 నుంచి 20 శాతం లోపు మొక్కలకు నష్టం కలిగితే వాటి స్థానంలో మళ్లీ మొక్క నాటుతున్నాం. వందశాతం ఫలితాలు వచ్చేలా అందరి భాగస్వామ్యంతో కష్టపడుతున్నాం.
– కొండల్‌రెడ్డి, ఫారెస్ట్‌రేంజ్ ఆఫీసర్

83.29శాతం

83.29శాతం

83.29శాతం