
కుక్కల ఆపరేషన్ @ రూ.2.97 లక్షలు
జనగామ: జనగామ మున్సిపల్‌లో కుక్కల సంచారం ప్రజల పాలిట ప్రమాదకరంగా మారింది. ఏ వీధికెళ్లినా ఏ ముందులే అన్నట్టుగా అడుగడుగునా శునకాలు రాజ్యమేలుతున్నాయి. కాలినడకన కనిపించినా.. ద్విచక్రవాహనం వెళ్తున్నా.. కుక్కలు వెంబడిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల అనేక వార్డుల్లో కుక్కల దాడుల్లో పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా బయటకు పంపించాలంటేనే వణికిపోతున్నారు. ఈ నేపధ్యంలో గతేడాది సెప్టెంబర్–అక్టోబర్ మాసంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసేందుకు పురపాలిక అధికారులు నిర్ణయం తీసుకున్నారు. చంపక్‌హిల్స్ డంపింగ్ యార్డు సమీపంలో నిర్మాణం చేసిన జంతువుల జనన నియంత్రణ (ఏబీసీ/కు.ని) సెంటర్‌లో ఈ ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. అయితే కుక్కలను పట్టుకునే సమయంలో లొకేషన్‌లో ట్రేస్ అవుట్ చేయాలి. ఆపరేషన్ చేసి, ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత ఎక్కడ నుంచి పట్టుకు వెళుతున్నారో, అక్కడే వదిలిపెట్టి పూర్తి ఆధారాలు మున్సిపల్‌లో అందుబాటులో ఉంచుకోవాలి.
180 కుక్కలకు ఆపరేషన్
అధికారుల లెక్కల ప్రకారం విడతల వారీగా 180 కుక్కలను పట్టుకుని ఏబీసీ సెంటర్‌కు తరలించి కు.ని ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్‌కు ముందు మూడు రోజుల పాటు సంరక్షించి, 4వ రోజు సర్జరీ చేస్తారు. మరో మూడు రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుకుని, ఏడవ రోజు కుక్కను పట్టుకు వెళ్లిన ప్రదేశంలో వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో శునకం ఆపరేషన్ ఖర్చు కోసం సుమారు రూ.1,650 లెక్కన మొత్తంగా రూ.2.97లక్షల వరకు ఖర్చు చేశారు. కుక్కల సంతతి తగ్గించేందుకు ఆపరేషన్ కార్యక్రమం బాగున్నప్పటికీ, కు.ని తర్వాత వాటిని ఎక్కడ వదిలేశారు.. జీపీఎస్ లొకేషన్ ఎక్కడ? అనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేకుండా పోయింది. పట్టణంలో ఏ వార్డుకు వెళ్లినా పదుల సంఖ్యలో కుక్కలు దాడి చేసే పరిస్థితికి చేరుకున్నాయి. లక్షల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేసి, శునకాలకు ఆపరేషన్ చేయించినా, ఫలితం లేదంటున్నారు పట్టణ ప్రజలు. కుక్కల ఆపరేషన్ కోసం చేసిన ఖర్చు వివరాలకు సంబంధించి విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై శానిటేషన్ ఇన్‌స్పెపెక్టర్ గోపయ్య మాట్లాడుతూ కుక్కల ఆపరేషన్‌కు రూ.2.97 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కుక్కలను పట్టుకు వెళ్లిన ప్రదేశం, జీపీఎస్ తమ వద్ద లేదన్నారు.
ఎక్కడ పట్టుకెళ్లారు
జీపీఎస్ లొకేషన్ ఉందా ?
వీధుల వెంట గుంపులుగుంపులుగా
శునకాలు