
అవే సమస్యలు..తీరని వ్యథలు!
జనగామ రూరల్: ఏళ్ల తరబడి పట్టా పాస్‌బుక్ కావడం లేదని ఒకరు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని దివ్యాంగుడు, భూమిని కబ్జా చేశారని మరొకరు, పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని వృద్ధులు.. ఇలా ప్రజలు ప్రజావాణికి వచ్చారు. చెప్పులరిగేలా తిరుగుతున్నా.. సమస్యలు పరిష్కారం కావడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్లు రోహిత్‌సింగ్, పింకేష్‌కుమార్‌లతో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా వినతులు స్వీకరించారు. మొత్తం 58 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న వినతులను తక్షణమే పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని సమస్యను దర ఖాస్తుదారులకు తెలియజేయాలన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతుందన్నారు. లబ్ధిదారులు నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓ గోపిరామ్, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత నాయక్, డీఆర్‌డీఓ వసంత, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మరికొన్ని సమస్యలు ఇలా..
● రఘునాథపల్లి మండలం మేకలగట్టు గ్రామానికి చెందిన దేవేందర్ తన తండ్రి ముడావత్ లింబ సర్వే నంబర్ 310 లో 2008 సంవత్సరంలో సర్పంచ్ అనుమతి పొంది ఇంటిని నిర్మించుకోగా దాని ధ్రువీకరణ పత్రం, ఇంటి నంబర్ ఇప్పించాలని కోరారు.
● పాత హరిజనవాడలో సర్వే నంబర్ 403/82, 404/82లో సొంత స్థలంలో గంధమల్ల ఇస్తారి అనే వ్యక్తి ఆక్రమించి రేకుల షెడ్డు నిర్మిస్తున్నారని, తగిన చర్య తీసుకోవాలని బచ్చన్నపేటకు చెందిన విజయలక్ష్మి విన్నవించారు.
● తన పేరుమీద ఉన్న 12 గుంటల భూమికి పట్టా పాస్‌బుక్ ఇచ్చి రైతు భరోసా వచ్చేలా చూడాలని రఘునాథపల్లి మండలం మాధారంకు చెందిన మోహన్ వినతిపత్రం అందించారు.
● కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ వీహెచ్ పీఎస్ ఆధ్వర్యంలో బిర్రు నగేష్, గడ్డం సోమరాజ్ కలెక్టర్‌కు విన్నవించారు.
● లింగాలఘణపురం మండలం చీటూరుకు చెందిన వృద్ధురాలు ఎలిశాల రాజమ్మకు వృద్ధాప్య పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌కు వేడుకుంది.
ప్రజావాణిలో 58 దరఖాస్తులు
ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా