
ప్రతీ నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు
జనగామ: అర్హులైన ప్రతీ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆర్డీఓ గోపీరాం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జనగామ నియోజకవర్గస్థాయి ఇంది రమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్‌లతో కలిసి ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో నిరుపేదల కల సాకారం అవుతుందన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో భూ భారతి సదస్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించి సమస్యలు పరిష్కారం చేస్తున్నామన్నారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం వంటి ప్రభుత్వ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తున్నామన్నారు. వ్యవసాయం పండుగలా చేపట్టేందుకు రైతులు పండించిన ధాన్యం కనీస మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు. సన్నాలు పండించే రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహకంగా క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. రైతులకు రుణమాఫీతోపాటు రైతు భరోసా పథకం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేస్తే అధికారులు, ప్రజాప్రతినిధులతో వచ్చి ప్రారంభిస్తామన్నారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి వద్ద దమ్ము ఉందని, సంక్షేమం, అభివృద్ధికి ఎక్కడా ఇబ్బందులు ఉండవన్నారు. అంతకు ముందు జనగామ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, జనగామ రూరల్, బచ్చన్నపేట, నర్మెట్ట, తరిగొప్పుల మండలాలకు చెందిన 816 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను ఎంపీ అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, హౌసింగ్ పీడీ మాతృనాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆర్‌టీఏ మెంబర్ అభిగౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఎంకు దమ్ముంది.. సంక్షేమం,
అభివృద్ధి ఆగదు
ఇళ్ల పట్టాల పంపిణీలో
ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి