
జూన్ లోపు పనులు పూర్తిచేయాలి
జనగామ: జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్డు నుంచి జ్యోతినగర్ కాలనీ మీదుగా 3వ వార్డులో నిర్మాణం చేపట్టిన అండర్ గ్రౌండ్ నాలా పనులు జూన్‌లోగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. వార్డు మాజీ కౌన్సిలర్ పగిడిపాటి సుధాసుగాణాకర్‌రాజుతో కలిసి ఆయన పనులను గురువారం పరిశీలించారు. ప్రతీ వారం వచ్చి పనులను పరిశీలిస్తానని, జాప్యం చేయొద్దని సూచించారు.
లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ నుంచి లైసెన్స్ సర్వేయర్ శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని అన్ని మీ–సేవ కేంద్రాల్లో ఈనెల 17వ తేదీ వరకు అపప్లై చేసుకోవచ్చని, ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలో 50 పని దినాలు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ గణిత శాస్త్రం అంశంగా, కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ, డిప్లొమా(సివిల్), బీటెక్(సివిల్) పూర్తి చేసి ఉండాలన్నారు.
13న జాబ్ మేళా
జనగామ రూరల్: జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈనెల 13న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి పి.సాహితి ఒక ప్రకటనలో తెలిపారు. వీటుసీ స్కిల్ డెవలప్‌మెంట్ సెంట ర్ ట్రైనింగ్ కం ప్లెస్‌మెంట్ కోసం ఇంటర్వ్యూ లు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న జనగామతోపాటు ఉమ్మడి వరంగల్ నిరుద్యోగ యువతీ యువకులు బయోడేటా లేదా రెస్యూమ్, విద్యార్హతల సర్టిఫికట్స్ జిరాక్స్‌తో ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని 8వ నంబర్ గదికి రావాలని సూచించారు. వివరాల కు సీనియర్ అసిస్టెంట్ జె.గీతను 79954 30401 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
నేడు ‘డయల్ యువర్ డీఎం’
జనగామ రూరల్: ఆర్టీసీ జనగామ డిపోలో శుక్రవారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ స్వాతి ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని బచ్చన్నపేట, దేవరుప్పుల, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, రఘునాథపల్లి, మద్దూరు, పాలకుర్తి మండలాల్లోని గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సేవలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలతో పాటుగా సూచనలు సలహాలను ఇవ్వాలని సూచించారు. ఇందుకు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 9959226050 నంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
కోర్టుకు హాజరైన
పొన్నాల లక్ష్మయ్య
జనగామ రూరల్: జిల్లా ఉద్యమ కేసులో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గురువారం జనగామ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం గిర్నిగడ్డ ప్రాంతంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు దుర్గమ్మ గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్, నాయకులు ఆకుల సతీష్, జంగిటి అంజయ్య, గురువయ్య, ఎండీ.మాజీద్, సౌడ మహేష్, యాట క్రాంతికుమార్ తదితరులున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
జనగామ రూరల్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం పనితీరును మెరుగుపర్చేందుకు ‘ర్యాప్’ పథకంలో భాగంగా జిల్లాకు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు కేటాయించారని జిల్లా పరిశ్రమల మేనేజర్ శివకృష్ణ ఠాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, ఈనెల 10 తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని సూచించారు.