కాగితాల్లోనే ప్రత్యామ్నాయ ఘాట్‌రోడ్డు | - | Sakshi
Sakshi News home page

కాగితాల్లోనే ప్రత్యామ్నాయ ఘాట్‌రోడ్డు

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

కొండగట్టు అంజన్న భక్తులకు భద్రత కరువు ● ఐదేళ్ల క్రితం రూ.100 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు ● అడుగు ముందుకు పడని వైనం

కొండగట్టు అంజన్న భక్తులకు భద్రత కరువు ● ఐదేళ్ల క్రితం రూ.100 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు ● అడుగు ముందుకు పడని వైనం

మల్యాల: కొండగట్టు ఘాట్‌రోడ్డుపై సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్లిన బస్సు ఎనిమిదేళ్ల క్రితం బోల్తాపడి 61మంది మృతి చెందిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే ప్రత్యామ్నాయ ఘాట్‌రోడ్డు నిర్మాణం తెరపైకి వచ్చింది. మెట్లదారి వెంట ప్రత్యామ్నాయ ఘాట్‌రోడ్డు ఏర్పాటుకు ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు చేసినా.. నేటికీ అడుగు ముందుకు పడడం లేదు. మండలంలోని ముత్యంపేట శివారు కొండగట్టు ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా మారింది. నిత్యం వేలాదిమంది భక్తులు వాహనాల్లో శ్రీఆంజనేయస్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. బస్సు ప్రమాదం జరిగిన అనంతరం మూల మలుపుతోపాటు మరో రెండుచోట్ల కేవలం సేఫ్టీవాల్‌ ఏర్పాటు చేశారు. నేటికీ దారి ఘాట్‌రోడ్డు దారి పొడవునా ప్రమాదకరంగా ఉంది. ఘాట్‌రోడ్డు మూడు దశాబ్దాల క్రితం నిర్మించారు. అయితే ఎనిమిదేళ్ల క్రితం బస్సు ప్రమాదంతో రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించలేదన్న విషయం వెలుగుచూసింది. ఘాట్‌రోడ్డు వెంట భారీ వాహనాల రాకపోకలకు అనువుగా లేదంటూ రోడ్డు భద్రత అధికారి ఆదేశాల మేరకు మూసివేశారు. ప్రత్యామ్నాయ రోడ్డు వేయాలని సూచించారు. మూడేళ్ల క్రితం స్థానికుల విన్నపాల మేరకు ఘాట్‌రోడ్డుపై చిన్న వాహనాలను మాత్రమే అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఘాట్‌రోడ్డు వెంట తరచూ ప్రమాదాలు

ఘాట్‌రోడ్డు వెంట వెళ్లే చిన్న వాహనాలను అనుమతించడంతో ప్రయాణికులు ఆటోల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. గతంలో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న అనంతరం ఘాట్‌రోడ్డు వెళ్తున్న లారీ బ్రేక్‌లు పడకపోవడంతో మెట్లదారిపై బోల్తాపడి 10మంది ప్రాణాలు కోల్పోయారు. కొండగట్టుకు వచ్చే భక్తుల ఆటోలు, వాహనాలపై అధికారుల నిఘా కొరవడడంతో కాలం చెల్లిన వాహనాలతో ఘాట్‌రోడ్డు వెంట తరచూ ప్రమాదాలు జరుతున్నాయి. అంజన్న భక్తుల భద్రత దృష్ట్యా ఐదేళ్ల క్రితం ప్రత్యామ్నాయ ఘాట్‌రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. మెట్లదారి వెంట సుమారు 4కిలోమీటర్ల మేర సుమారు రూ.100కోట్ల వ్యయంతో ఘాట్‌రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. అయినప్పటికీ కాగితాలు దాటకపోవడంతో భక్తులు ఇప్పటికీ ప్రమాదాల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement