మృతదేహం గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

మృతదేహం గుర్తింపు

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

రామగుండం: రైల్వేస్టేషన్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట డ్రైనేజీలో రైల్వే పోలీసులు గుర్తించిన మృతదేహం రైల్వేస్టేషన్‌ ఏరియా శివాజీనగర్‌ కాలనీకి చెందిన గుంజపడుగు శ్యాం(35)గా గుర్తించినట్లు జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి గంగారపు తిరుపతి తెలిపారు. మృతదేహానికి గురువారం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.

మూడేళ్లలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

శివాజీనగర్‌లో నివాసముండే గుంజపడుగు నారాయణ–రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు శంకర్‌, శ్యాం. నారాయణ కుటుంబపోషణ నిమిత్తం సింగరేణి కాంట్రాక్టర్‌ వద్ద క్రేన్‌ ఆపరేటర్‌గా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తుంటాడు. ఈనేపథ్యంలో పెద్ద కుమారుడు శంకర్‌ స్థానికంగా సెలూన్‌ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండగా 2023 సెప్టెంబర్‌లో రాజీవ్‌ రహదారిపై నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతడికి భార్య అనూష, రవితేజ, విశ్వతేజ కుమారులున్నారు. ఆ తర్వాత ఏడాదిన్నర వ్యవధిలోనే 2025 జనవరిలో నారాయణ భార్య రాజేశ్వరి క్యాన్సర్‌తో కన్నుమూసింది. చిన్న కుమారుడు శ్యాం(35) నాలుగు రోజుల క్రితం తన బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగ్యనగర్‌ రైలు ఎక్కి రామగుండం వస్తున్న క్రమంలో రైల్వేస్టేషన్‌ దాటిపోయిన తర్వాత రైలు నుంచి దిగే క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్‌ పక్కనున్న డ్రైనేజీలో పడి మృతిచెందగా మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మూడేళ్ల వ్యవధిలో తన కళ్ల ముందే ఇద్దరు కుమారులు, భార్య ఏకంగా ముగ్గురు కుటుంబసభ్యులను కోల్పోవడంతో గుంజపడుగు నారాయణ ఒంటరి వాడయ్యాడు. . కాగా నారాయణ దుస్థితిని చూస్తూ కాలనీవాసులు కంటతడి పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement