అవమానంతో వ్యక్తి ఆత్మహత్య
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్లకు చెందిన బిజిలి రాజయ్య(45) అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపిన వివరాలు.. రాజయ్య రెండేళ్లక్రితం కుమార్తె వివాహం కోసం గర్రెపల్లికి చెందిన బిజిలి మల్లయ్య వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. చెల్లించడంలో ఆలస్యం కావడంతో రెండురోజులక్రితం పందులను తీసుకెళ్లాడు. పందులకు రూ.35వేల ధర నిర్ణయించి మిగిలిన రూ.65వేలు నాలుగు నెలల్లో చెల్లించాలని కుల పెద్దమనుషుల సమక్షంలో ఒప్పందం చేసుకున్నప్పటికీ, వాయిదా ప్రకారం డబ్బులివ్వకుంటే ఇంటికి తాళం వేస్తానని మల్లయ్య బెదిరించడంతో రాజయ్య మనస్తాపానికి గురయ్యాడు. గురువారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రమా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
వివాహిత అదృశ్యం.. కేసు నమోదు
రామడుగు: దత్తోజీపల్లి గ్రామానికి చెందిన తోట్ల మమత(30) అనే వివాహిత అదృశ్యమైంది. మమత బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త నరేశ్ గురువారం రామడుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.
గంజాయి రవాణా కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు
గోదావరిఖనిటౌన్: గంజాయి రవాణా, విక్రయానికి పాల్పడిన ఫైవింక్లయిన్‌కు చెందిన నిందితుడు షేక్ కాజా గౌసుద్దీన్‌కు మూడేళ్ల కఠిన కారాగా శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి కె.సునీత గురువారం తీర్పు వెలువరించారు. 2021లో గోదావరిఖని ఫైవింక్లయిన్ చౌరస్తా వద్ద వన్‌టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా కొత్తగూడెం నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,900 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని అప్పటి వన్‌టౌన్ సీఐ రమేశ్‌బాబు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఏ1 నిందితుడు చనిపోవడంతో ఏ2 నిందితుడు షేక్ కాజా గౌసుద్దీన్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి నిందితునికి మూడేళ్ల ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.10వేల జరిమాన విధించారు.


