కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ అంబేడ్కర్ స్టేడి యం గురువారం సరికొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. జిల్లా పాఠశాలల క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 బాలి కల కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. గెలు పే లక్ష్యంగా మైదానంలోకి దిగిన బాలికలు ముందస్తుగా ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ మ్యాచ్‌కు సిద్ధమయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే పీఈ టీలు, పీడీలు క్రీడాకారిణులకు సూచనలిస్తూ.. వ్యూహాలను వివరిస్తూ కనిపించారు. కబడ్డీ కోర్టులో ప్రత్యర్థి జట్టు రైడర్‌ను బోల్తా కొట్టిస్తూ బాలికలు చేసిన టాకిల్స్ ప్రేక్షకులను అబ్బురపరిచాయి. మ్యాచ్ ఆడేటప్పుడు ఆభరణాలు పెట్టుకోకూడదని ఆంపైర్లు స్పష్టం చేయడంతో.. ఒక క్రీడాకారిణి కాలి పట్టీలను తోటి క్రీడాకారిణి సహాయంతో తీసి నిబంధనలను గౌరవించింది. అటు వాలీబాల్ కోర్టులో బంతిని ప్రత్యర్థి కోర్టులోకి పంపేందుకు బాలికలు అద్భుతమైన సర్వీస్‌లతో పాయింట్ల వర్షం కురిపించారు. భానుడి ప్రతాపానికి మైదానం వేడెక్కినా బాలికల ఉత్సాహం మాత్రం తగ్గలేదు. కొందరు గొడుగుల ఆసరా తీసుకోగా.. మరికొందరు మైదానంలోనే నీళ్లు తాగుతూ సేదతీరారు.


