జగిత్యాలఅగ్రికల్చర్: నైరుతి రుతుపవనాల కాలం ప్రారంభమైనా.. వాతావరణంలో మార్పులతో వర్షాలు కురవడం లేదు. మృగశిర కార్తె ముగిసినప్పటికీ ఒక్కసారి కూడా చినుకు పడలేదు. ఎల్‌నినో ప్రభావంతో ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీల గరిష్ట స్థాయిలో కదలాడుతున్నాయి. దీంతో రైతులు వర్షాలకోసం కప్ప తల్లి ఆటలు, ఆలయాల్లో జలాభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు పంటల సాగుకు అదునుదాటుతోందంటూ అన్నదాతలు ఆగమాగం అవుతున్నారు.
68 శాతం లోటు వర్షపాతం
ఈ ఏడాది మొత్తంగా చూస్తే ఇప్పటివరకు జిల్లాలో 68శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 20 మండలాల్లో కేవలం వెల్గటూర్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ (మృగశిర కార్తె ముగింపు) వరకు జిల్లా సాధారణ వర్షపాతం 120 మిల్లీమీటర్లు. కానీ.. ఇప్పటివరకు 20శాతం కూడా కురవలేదు. కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్ మండలాల్లో లోటు వర్షపాతం ఏర్పడింది. మిగిలిన 16 మండలాల్లో అధిక లోటు వర్షపాతం నమోదైంది. భీమారంలో 98 శాతం, ధర్మపురిలో 92, కొడిమ్యాలలో 83, జగిత్యాల రూరల్‌లో 83, రాయికల్‌లో 81, గొల్లపల్లిలో 79, సారంగాపూర్‌లో 76, బీర్‌పూర్‌లో 74, బుగ్గారంలో 73, పెగడపల్లిలో 72, మేడిపల్లిలో 71, మల్యాలలో 70, మల్లాపూర్‌లో 69, ఇబ్రహీంపట్నంలో 69, ఎండపల్లిలో 63, జగిత్యాలలో 60, కోరుట్లలో 59, మెట్‌పల్లిలో 51, కథలాపూర్‌లో 50 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది.
అక్కడక్కడ పంటల సాగు
వాస్తవానికి 60 నుంచి 70 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. విత్తనాలను వేసి ఇబ్బంది పడొద్దని ఓ వైపు వ్యవసాయాధికారులు ప్రకటిస్తున్నప్పటికీ అదును దాటుతోందంటూ రైతులు అక్కడక్కడ పంటలు సాగు చేస్తున్నారు. నిజానికి పసుపు వంటి పంటలు జూన్‌లోనే సాగు చేయాల్సి ఉంటుంది. మెట్‌పల్లి, కథలాపూర్, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కోరుట్ల మండలాల్లో వానతో సంబంధం లేకుండా పసుపు విత్తనం వేస్తున్నారు. వర్షాలు ఎలాగైనా కురుస్తాయనే ఆశతో విత్తనాలు వేసిన రైతులు.. విత్తనాలు మాడిపోకుండా బావుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని డ్రిప్ ద్వారా తడులు అందిస్తున్నారు. ఎంత నీరు ఇచ్చినప్పటికీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వేడి వాతావరణంతో విత్తనాలు కొన్ని ప్రాంతాల్లో భూమిలోనే మాడిపోతున్నాయి. కొద్దిపాటి జల్లులకే జనుము, జీలుగ విత్తనాలు చల్లిన రైతులు మొలకలను కాపాడుకునేందుకు నీటి తడులు అందిస్తున్నారు. వరిలో దీర్ఘకాలిక రకాలు సాగు చేసే రైతులు వ్యవసాయ బావుల్లో ఉన్న కొద్ది నీటితో నార్లు పోసుకుంటున్నారు.
మృగశిర ముగిసినా జాడలేని వర్షాలు
జిల్లాలో 68శాతం లోటు వర్షపాతం
అదునుదాటుతోందని రైతుల్లో ఆందోళన
వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపులు


