కోల్‌సిటీ: వేర్వేరు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఇద్దరి నేత్రాలను దానం చేసి రెంటు కుటంంబాలు ఆదర్శంగా నిలిచాయి. గోదావరిఖని కాకతీయనగర్‌కు చెందిన డి.రఘు (46) శుక్రవారం చెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు గాయాలుకావడంతో వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన సింగరేణి ఉద్యోగి రాజు (29) శనివారం తెల్లవారుజామున గోదావరిఖనిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం కరీంనగర్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినా ప్రాణాలు దక్కలేదు. మృతుల కుటుంబ సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ ఇద్దరి నేత్రాలను సేకరించి హైదరాబాద్‌కు తరలించారు. ఈ నేత్రాల ద్వారా నలుగురు దృష్టి లోపం ఉన్న వారికి చూపు అందనుంది. విషాద సమయంలోనూ నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకృష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, భీష్మాచారి, కేఎస్ వాసు, వెల్ది కవిత అనంతరాములు, తడబోయిన రాములు, దేవి లక్ష్మీ నరసయ్య తదితరులు అభినందించారు.
బావిలో పడి బాలుడి మృతి
కొత్తపల్లి: కరీంనగర్ పరిధిలోని రేకుర్తిలోని బతుకమ్మ చెరువు బావిలో పడి బాలుడు మృతిచెందాడు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్ వివరాల ప్రకారం.. రేకుర్తిలోని స్వామికాలనీకి చెందిన షకీర్‌ఖాన్ అలియాస్ ఇర్ఫాన్ ఖాన్ (16) తన స్నేహితులు షేక్ అఫ్రోజ్, యాకుబ్ అలీ, షకీర్‌ఖాన్లతో కలిసి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కాలనీ సమీపంలోని బతుకమ్మ చెరువు వద్ద ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు సమీపంలోని ఓ బావి వద్ద ఆడుకుంటుండగా షకీర్ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. తనతో ఉన్న స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వెంటనే వారు షకీర్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బటయకు తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


