జగిత్యాలటౌన్: విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు కేంద్రీయ విద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు చల్‌గల్‌లో స్థలం కేటాయించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి చల్‌గల్‌లో 25ఎకరాలు కేటాయించాలని ఎమ్మెల్సీగా తాను, మంత్రి అడ్లూరి, కలెక్టర్ సత్యప్రసాద్ ప్రతిపాదించామని, ఇప్పుడు పదెకరాలు కేటాయిస్తే క్షీరాభిషేకాలు ఎందుకని, ఇందులో ఎమ్మెల్యే ఆలోచన ఏంటో అర్థం కావడం లేదన్నారు. చల్‌గల్‌లో ఉన్న 75ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 20ఎకరాలు, కేంద్రీయ విద్యాలయానికి ఐదెకాలు, మిగిలిన 50ఎకరాల్లో హార్టికల్చర్ వర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ప్రకటనలకే పరిమితమైందని, ఇప్పటివరకు విధివిధానాలు ఖరారు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కేసీఆర్ హయాంలో 296 రెసిడెన్షియల్ స్కూళ్లకు అదనంగా మరో 613 ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆ స్కూళ్లను యథావిధిగా కొనసాగిస్తే కేసీఆర్‌కు పేరొస్తుందని భావించిన రేవంత్‌రెడ్డి యంగ్ ఇండియా పేరిట కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు పూనుకున్నారని విమర్శించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, లోక బాపురెడ్డి, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, ధర రమేష్, కల్లెపెల్లి దుర్గయ్య, నేహాల్, వెంకటేశ్వర్‌రావు, చెట్‌పల్లి సుధాకర్, ప్రియాంక, గుండ మధు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి


