జగిత్యాలక్రైం: అడవుల్లో ఉండే వన్యప్రాణులు వేసవిలో బయటకు వస్తుండటంతో కుక్కలు, వేటగాళ్ల బారిన పడుతున్నాయి. మరికొన్ని ప్రమాదవశాత్తు బావుల్లో పడి మృత్యువాత పడుతున్నాయి. దీంతో అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. వాటికి నిత్యం నీటిని అందుబాటులో ఉంచి వాటి దాహం తీర్చుతున్నారు. జిల్లాలోని ఐదురేంజ్‌ల పరిధిలో 53 వేల హెక్టార్లలో అటవీ విస్తరించి ఉంది.
144 సాసర్‌పిట్స్ నిర్మాణం
గతంలో ఉన్న వాటితోపాటు అడవుల్లో నీటి నిల్వలు ఉంచేందుకు మొత్తం 144 సాసర్‌పిట్స్, పర్కులేషన్ ట్యాంకులు నిర్మించారు. సాసర్‌పిట్స్‌లో ట్యాంకర్ల ద్వారా నీటిని పోసి వన్యప్రాణుల దాహార్తి తీర్చుతున్నారు. అడవిని విడిచి నీటి కోసం బయటకు వస్తే ప్రమాదాల బారిన పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
చెక్‌డ్యామ్‌ల ద్వారా..
అడవుల్లో భూగర్భజలాలు పెంచేందుకు ఇప్పటికే 47 చెక్‌డ్యామ్‌లను నిర్మాణం చేపట్టారు. దీంతోపాటు 112 నీటి కుంటలున్నాయి. ఇందులో వర్షపు నీటిని వృథాగా పోకుండా అడ్డుకట్ట వేసి చె క్‌డ్యామ్‌లు, నీటి కుంటల్లో నీటి నిలువలు చేశా రు. వన్యప్రాణులు ఆ నీటిని తాగడంతోపాటు భూగర్భజలాలు పైకి రావడంతో చెట్లు కూడా విస్తారంగా పెరిగేందుకు దోహదపడుతున్నాయి.
మూడు సోలార్‌బోర్ల ఏర్పాటు
అడవుల్లో మూడు సోలార్‌బోర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి పనితీరు ఆధారంగా మరికొన్ని బో ర్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సోలార్ బోర్లు ఏర్పాటుచేశారు. సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా అవుతుండడంతో పెద్దగా సమస్య లేకుండా ఉంది. అలాగే అడవుల మీదుగా వెళ్లే వాగుల్లోనూ నీటి నిల్వ ఉండటంతో వన్యప్రాణులు దాహం తీర్చుకుంటున్నాయి.
ప్రత్యేక చర్యలు
అటవీ ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణులకు వేసవి దృష్ట్యా నీటి వసతి కల్పించాం. వన్యప్రాణులు బయటకు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నా యి. ఈ నేపథ్యంలోనే వన్యప్రాణులు సంచరించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా నీటి వసతులు కల్పించి వాటి దాహార్తి తీర్చేలా చర్యలు చేపట్టాం.
– రవిప్రసాద్, అటవీశాఖ అధికారి
జిల్లాలో అడవుల విస్తీర్ణం ఇలా..
విస్తీర్ణం 53 వేల హెక్టార్లు
సాసర్‌పిట్స్ 144
చెక్‌డ్యామ్‌లు 47
నీటికుంటలు 112
వాగులు 10
సోలార్ బోర్లు 3


