కేసీఆర్‌ సభకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సభకు ఏర్పాట్లు

Apr 12 2026 3:42 AM | Updated on Apr 12 2026 3:42 AM

● ఈనెల 20న భారీ బహిరంగ ● స్థలాల పరిశీలన చేసిన జీవన్‌రెడ్డి ● లక్ష మంది జనసమీకరణే లక్ష్యం

జగిత్యాల: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అదేరోజు మాజీమంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో లాంఛనంగా చేరనున్నారు. ఈ మేరకు సభకు సంబంధించి ఏర్పాట్లను మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్‌ కళాశాల, మినీస్టేడియం, మోతె సమీపంలో, ధరూర్‌ క్యాంప్‌ సమీపంలో కొన్ని స్థలాలను పరిశీలించారు. ఇంకా సభా ప్రాంగణం ఫైనల్‌ కాలేదు. మొత్తానికి జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తున్నారు.

లక్షమంది జనసమీకరణే లక్ష్యం

కేసీఆర్‌ సభ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లోని ప్రతి నియోజకవర్గం నుంచి ప్రజలను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం.. సభకు కేసీఆర్‌ వస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్సీ రమణ, విద్యాసాగర్‌ రావు, దావ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, జన సమీకరణకు కృషి చేస్తున్నారు.

కేసీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యం

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఒక్క హామీ అమలు కావడం లేదని, 45 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి రావడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ రమణ అన్నారు. సభకు కేసీఆర్‌ను ఆహ్వానించామని, సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు.

జీవన్‌రెడ్డి రావడం శుభపరిణామం

ప్రజల కోసం పాటుపడే జీవన్‌రెడ్డి ప్రతిపక్షపార్టీలోకి రావడం శుభపరిణామమని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. ప్రజాసేవకే అంకితమైన కేసీఆర్‌తో కలిసి పనిచేయడానికి జీవన్‌రెడ్డి రావడం ఎంతో గొప్ప విషయమని, కౌన్సిలర్లుగా గెలిచిన వారే హుందాగా ఉండే ఈ కాలంలో జీవన్‌రెడ్డి ఇంకా చెక్క కుర్చీలతోనే ఉంటూ ఆయన హుందాతనాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిపారు. రానున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు.

బహిరంగ సభకు తరలిరావాలి

జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. ఈ మేరకు స్థల పరిశీలన చేశామని, జీవన్‌రెడ్డి వంటి నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడం గొప్ప పరిణామమని పేర్కొన్నారు. అన్ని గ్రామాల నుంచి ప్రజలను తరలిస్తామన్నారు. లక్ష మంది ప్రజలు వచ్చేలా చూస్తామన్నారు.

అస్తవ్యస్తంగా పాలన

రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మౌనంగా ఉన్నారని, ప్రజలు వారికి ఓట్లు వేశారని, పాలన చూద్దామని ఓపికగా ఉంటున్నారని తెలిపారు. కానీ కాంగ్రెస్‌ పాలనలో అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులకు గురికావడంతో పాటు, బ్లాక్‌మెయిల్‌ ప్రభుత్వంగా మారిందన్నారు. జీవన్‌రెడ్డి వంటి నేత బీఆర్‌ఎస్‌లోకి రావడం శుభపరిణామమని, కేసీఆర్‌ సమక్షంలో ఈనెల 20న చేరుతున్నారని వివరించారు.

నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి

కాంగ్రెస్‌ పార్టీకి పునర్జీవం పోసిన నాయకులు జీవన్‌రెడ్డి అని, నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి అని, కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని బీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయించుకోవడం శుభ పరిణామమని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత అన్నారు. జీవన్‌రెడ్డి రాకతో మరింత బలం చేకూరుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement