జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రికి సుమారు 280 మంది నర్సింగ్ ఆఫీసర్లు రాగా, ప్రొబేషనరీ కాలం పూర్తి చేసుకున్న వారు రెగ్యులరైజేషన్ ఫైల్‌ను డీపీహెచ్‌కు పంపాలంటే ఇక్కడి అధికారులు ఆమ్యామ్యాలు అడిగినంత ఇస్తేనే ఫైల్ పంపిస్తామని నర్సింగ్ అధికారులు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈనేపథ్యంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, డబ్బులు అడిగారని ప్రజావాణిలోనే పలువురు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మార్చి 26న ‘పైసా కొట్టు.. సర్టిఫికెట్ పట్టు’ అని ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో విజిలెన్స్ అధికారులు శుక్రవారం కలెక్టరేట్‌లో విచారణ చేపట్టినట్లు తెలిసింది. త్వరలోనే పలువురిపై వేటు పడే అవకాశాలున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.
లక్ష్యాలను సాధించాలి
జగిత్యాలజోన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్‌ను శుక్రవారం సందర్శించి మాట్లాడారు. బాగా చదువుకుని సమాజం గౌరవించే స్థాయికి చేరుకోవాలన్నారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుకు రావాలని విద్యార్థినులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కటుకం చంద్రమోహన్, న్యాయవాదులు శివాణి, సింధు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
13 నుంచి ‘అరైవ్.. ఎలైవ్’
జగిత్యాలక్రైం: జిల్లాలో అరైవ్ ఎలైవ్ కార్యక్రమాన్ని ఈనెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గ్రామ స్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేసి, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన భద్రతా చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై వివరించడం, రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కీలకమైన గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన తదితర కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలందరూ పాల్గొని రోడ్డు భద్రత నియమాలను పాటించి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.
ఉపాధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఉపాధి పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని డీఆర్‌డీవో రాఘువరన్ అన్నారు. శుక్రవారం మండలంలోని వేములకుర్తి, బర్థీపూర్, మూలరాంపూర్, ఇబ్రహీంపట్నంలలో ఉపాధి పనులు, నర్సరీలను పరిశీలించారు. వేములకుర్తి ఫారెస్ట్‌లో తవ్వుతున్న కంటూరు కందకాలను పరిశీలించారు. కూలీల సంఖ్య పెంచాలని అధి కారులకు సూచించారు. అనంతరం ఇబ్రహీంపట్నంలో వీవో భవనాలను పరిశీలించారు.
అదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, సర్పంచులతో కలిసికట్టుగా వార్డు సభ్యులు గ్రామాభివృద్ధిలో పాలుపంచుకోవాలని డీఆర్‌డీవో రఘువరన్ సూచించారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో 2వ విడత వార్డుసభ్యుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇన్‌చార్జి ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో కొమురయ్య, ఈసీ వినోద్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గంగాధర్, శిక్షకులు రాకేశ్, రాజశేఖర్, రవీందర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


