టెండర్లకు ముందే పనులు | - | Sakshi
Sakshi News home page

టెండర్లకు ముందే పనులు

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

● కోరుట్ల మున్సిపాల్టీలో విడ్డూరం ● మద్దుల చెరువు గుర్రపు డెక్క తొలగింపు ● ఆరు నెలల క్రితం డీఎంఏకు ఫిర్యాదు ● విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు

కోరుట్ల: నియమ నిబంధనలు ఇక్కడ బలాదూర్‌.. అడిగేవారు లేక అధికారులు ఆడిందే ఆటగా చలామణి అవుతోంది. ఆరునెలల క్రితం మున్సిపల్‌ ఆధ్వర్యంలో టెండర్లు పిలవకుండానే పనులు పూర్తి చేసి తర్వాత టెండర్‌ ఖరారు చేసిన తీరు విడ్డూరం. ఈ విషయంలో కొందరు డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌కు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం విచారణ ఉచ్చు నుంచి ఎలా తప్పించుకోవాలా..? అని మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.

అప్పుడేం జరిగింది..?

గతేడాది సెప్టెంబర్‌లో బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అత్యవసరం అన్న సాకుతో మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌తో కొన్ని పనులకు ని ధులు కేటాయించారు. ఈ నిధుల నుంచి రూ.8,13,000 వెచ్చించి మద్దుల చెరువులోని గుర్రపు డెక్క తీయించే పనికి పూనుకున్నారు. నిబంధనల ప్రకారం ఈ పనులకు ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌తో పనులు చేయించాలి. దీనికి విరుద్ధంగా టెండర్లు పిలవకముందే తమకు అనుకూలంగా ఉండే ఓ కాంట్రాక్టర్‌తో ఆదరాబాదరాగా పనులు చేయించడం ప్రారంభించారు. అనంతరం టెండర్లు లేకుండా పనులు జరుగుతున్న వైనంపై చర్చ మొదలు కావడంతో పనులు కొనసాగుతున్న సమయంలో టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. టెండర్‌ వేయడానికి 24 సెప్టెంబర్‌ 2025 చివరి తేదీగా నిర్ణయించారు. అప్పటికే మద్దులచెరువులో గుర్రపు డెక్క తొలగించే పనులు పూర్తయ్యాయి. తర్వాత నామమాత్రంగా టెండర్లు పిలిచినట్లుగా చేసి వాటిని తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్‌కు అప్పగించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. తర్వాత టెండర్లు లేకుండా ఆదరాబాదరాగా చెరువులో గుర్రపు డెక్క ఎలా తొలగించారని, ఈ పనుల్లో అవినీతి చోటు చేసుకుందని ఫిర్యాదులు చేస్తే కలెక్టర్‌ ఆదేశాల మేరకు టెండర్లు పిలవక ముందే పనులు చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పుకొచ్చారు. నిజానికి నీటి పారుదల శాఖ పరిధిలో ఉన్న మద్దుల చెరువుకు కోరుట్ల మున్సిపల్‌ అధికారులు నిధుల కేటాయింపు ఎలా చేశారన్న ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ సమయంలో మున్సిపాల్టీకి ప్రజాప్రతినిధుల ఎన్నిక జరగకపోవడంతో అడిగేవారు లేకుండా పోయారు.

ఎట్టకేలకు విజిలెన్స్‌ విచారణ

మద్దులచెరువు గుర్రపు డెక్క తొలగింపులో పనులు చేసిన తరువాత టెండర్‌ పిలవడంలో అవినీతి చోటు చేసుకుందని ఆ పనులు నామమాత్రంగా జరిగాయని రెండునెలల క్రితం మాజీ కౌన్సిలర్‌ ఇందూరి సత్యం డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారం క్రితం డీఎంఏ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు. త్వరలో విజిలెన్స్‌ అధికారులు విచారణకు వస్తున్నట్లు సమాచారం. కొసమెరుపు ఏమిటంటే.. మద్దుల చెరువులో ఆదరాబాదరాగా ‘గుర్రపు డెక్క తొలగింపు పనులు పూర్తి అయ్యాయి’..అని చెప్పుకున్న అధికారులను మళ్లీ చెరువులో ఎక్కడికక్కడే గుర్రపు డెక్క విస్తరించి వెక్కిరిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement