కలిసి పనిచేద్దాం రండి | - | Sakshi
Sakshi News home page

కలిసి పనిచేద్దాం రండి

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

జగిత్యాలటౌన్‌: కేసీఆర్‌ను మరోసారి సీఎంను చేసేందుకు కలిసి పనిచేద్దాం రావాలని జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కోరారు. గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి భారీ కాన్వాయ్‌తో జిల్లాకేంద్రంలోని జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అప్పటికే నాయకులు, అనుచరులు, అభిమానులతో సిద్ధంగా ఉన్న జీవన్‌రెడ్డి కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. మార్టీ మార్పు తదితర అంశాలపై ఇద్దరు కలిసి సుమారు రెండు గంటల పాటు ముచ్చటించుకున్నారు. అనంతరం జీవన్‌రెడ్డిని కేటీఆర్‌ శాలువాతో సత్కరించారు. జీవన్‌రెడ్డి అనుచరులు, అభిమానులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జనం తాకిడిని తట్టుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కేటీఆర్‌ కారు దిగగానే సీఎం సీఎం అంటూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. జీవన్‌రెడ్డి జిందాబాద్‌ అంటూ ఆయన అనుచరుల నినదించారు. అవమానాలు భరించలేకే పార్టీ మారాల్సి వచ్చిందని జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పాలనకంటే బీఆర్‌ఎస్‌ పాలన బాగుందని కితాబిచ్చారు. రేవంత్‌రెడ్డి పాలన అన్ని రంగాల్లో విఫలమైందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలవబోతుందని జోస్యం చెప్పారు. కేటీఆర్‌ రాకతో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, చౌరస్తాలు గులాబీమయంగా మారాయి. చాలా రోజుల తర్వాత కేటీఆర్‌ జగిత్యాలకు రావడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులో ఉత్సాహం కనిపించింది. పట్టణ శివారు ధరూర్‌ కెనాల్‌ వద్ద బీఆర్‌ఎస్‌ శ్రేణులు కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికారు.

జీవన్‌రెడ్డి నివాసం వద్ద తొక్కిసలాట

కేటీరామారావు జీవన్‌రెడ్డి ఇంటికి రాగానే పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఇందులో ఓ రిపోర్టర్‌ కాలుకు ఫ్రాక్చర్‌ అయ్యింది. అతడిని ఆస్పత్రికి తరలించగా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి పరామర్శించా రు. అనంతరం సాయికుమార్‌ను జీవన్‌రెడ్డి కూడా పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

బీఆర్‌ఎస్‌ నాయకులతో కేటీఆర్‌ సమావేశం

జగిత్యాల: కేటీఆర్‌కు ధరూర్‌ వద్ద బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత ఆధ్వర్యంలో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కేటీఆర్‌ అక్కడి నుంచి నేరుగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఐదు నిమిషాలు కార్యకర్తలతో మాట్లాడారు. కేటీఆర్‌ వస్తున్నారని తెలుసుకున్న జగిత్యాల రూరల్‌, అర్బన్‌ మండలాల్లోని పలు గ్రామాల నుంచి జీవన్‌రెడ్డి అభిమానులు భారీగా తరలివచ్చారు. మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్‌, పాడి కౌశిక్‌రెడ్డి, నాయకులు బాజిరెడ్డి గోవర్దన్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, విద్యాసాగర్‌రావు, దామోదర్‌రావు, సుంకె రవిశంకర్‌, గణేశ్‌గుప్తా, దావ వసంత పాల్గొన్నారు.

జీవన్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్‌

కేసీఆర్‌ను కలిశాక నిర్ణయం ప్రకటిస్తానన్న జీవన్‌రెడ్డి

ఇద్దరి మధ్య రెండు గంటలకు పైగా చర్చలు

Advertisement
 
Advertisement
Advertisement