మల్లాపూర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌లో గురువారం హైడ్రామా సాగింది. మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభానికి మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులకు సమాచారం అందింది. దీంతో గురువారం ఉదయమే టెంట్లు, కుర్చీలు తెచ్చి తగిన ఏర్పాట్లు చేశారు. రైతులు కూడా మక్కలను యార్డుకు తెచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కేంద్రం ప్రారంభానికి వస్తున్నారని తెలిసి బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అక్కడికి చేరుకున్నారు. అయితే మార్క్‌ఫెడ్ అధికారులు టెంట్లు, కుర్చీలు తొలగించారు. అడిగితే కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. దీంతో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు మార్క్‌ఫెడ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అంతలో అక్కడికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేరుకున్నారు. కేంద్రం రద్దయినట్లు తెలుసుకుని మార్క్‌ఫెడ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రారంభం ఉందని తనకు సమాచారం ఇచ్చారని, ఇప్పుడు రద్దంటే ఎలా అని ప్రశ్నించారు. తన షెడ్యూల్ ప్రకారం వచ్చానని, సమాచారం ఇవ్వకుండా రద్దు చేయడమేంటని, రైతుల ఇబ్బందులు ఎవరు తీర్చుతారని నిలదీశారు. అక్కడే ఉన్న సామగ్రితో కేంద్రాన్ని ప్రారంభించారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని పేర్కొన్నారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు చిట్యాల లక్ష్మణ్, జెల్ల రాజేశ్వర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, మాజీ వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్, రైతుబంధు కమిటీ మాజీ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, ప్యాక్స్ మాజీ చైర్మన్ బద్దం అంజిరెడ్డి, బీఆర్‌ఎస్ పట్ణణ అధ్యక్షుడు బండి లింగస్వామి పాల్గొన్నారు.


