సీఎంను జీవన్‌రెడ్డి విమర్శించడం బాధాకరం | - | Sakshi
Sakshi News home page

సీఎంను జీవన్‌రెడ్డి విమర్శించడం బాధాకరం

Apr 10 2026 10:03 AM | Updated on Apr 10 2026 10:03 AM

జగిత్యాల: మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీని విమర్శించిన జీవన్‌రెడ్డి.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పోవాలనడం బాధాకరమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని మోతె కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకొస్తే దళితుడిని సీఎం చేస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన బీఆర్‌ఎస్‌ ఏం చేసిందని ప్రశ్నించారు. ఉద్యోగులకు జీతాలు కూడా రాలేదని విమర్శించారు. 2023 ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఓడిపోయాక రేవంత్‌రెడ్డి ఫోన్‌చేసి మంత్రి పదవి ఇస్తానన్నారని, పార్టీ మారవద్దని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌, వేణుగోపాల్‌, శ్రీధర్‌బాబు అభ్యర్థించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీని బలహీనపర్చాలని మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని కేటీఆర్‌ విమర్శించడం సరికాదన్నారు. కేసీఆర్‌ బీసీ, ఎస్సీలను ఎప్పుడూ దగ్గరకు రానివ్వలేదన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, రేవంత్‌రెడ్డి జగిత్యాల అభివృద్ధికి నిధులు కేటాయించారని తెలిపారు. మంత్రి పదవి ఇస్తే జీవన్‌రెడ్డి పార్టీ వీడేవారేనా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నందయ్య మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి పాలన కంటే కేసీఆర్‌పాలన బాగుందని జీవన్‌రెడ్డి అనడం శోచనీయమన్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, బండ శంకర్‌, దామోదర్‌రావు, గిరి నాగభూషణం పాల్గొన్నారు.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement