జగిత్యాలక్రైం: జగిత్యాల మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తోపారపు నిషాంత్ (9) గుండెపోటుతో సోమవారం మృతిచెందాడు. చంద్రశేఖర్, నవిత దంపతుల కుమారుడు నిషాంత్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. వారి వ్యవసాయ పొలం వద్దనున్న శివాలయంలో అన్నదానం చేస్తుండగా నిషాంత్‌కు ఫిట్స్ వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో గుండెపోటు రావడంతో మృతిచెందాడు.
కర్ణాటక వాటర్ ఫాల్స్‌లో యువకుడి..
కోరుట్ల: కర్ణాటకలోని అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలో విభూత వాటర్ ఫాల్స్‌లో ప్రమాదవశాత్తు పడి కోరుట్ల మున్సిపల్ వీలిన గ్రామం ఎఖీన్‌పూర్‌కు చెందిన శీలం అజయ్‌గౌడ్(25) మృతిచెందాడు. వివరాలు.. ఎఖీన్‌పూర్‌కు చెందిన శీలం వెంకటేశ్–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు అజయ్‌గౌడ్ 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చాడు. ఆదివారం సరదాగా హైదరాబాద్‌లో ఉండే ఇద్దరు స్నేహితులతో కలిసి కర్ణాటక టూర్ వెళ్లాడు. సోమవారం ఉదయం అంకోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని విభూత వాటర్ ఫాల్స్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీటిలో ఉన్న రాయి తాకి శ్వాస ఆడక మృతిచెందినట్లు సమాచారం. ఆయన వెంట ఉన్న స్నేహితులు ఆజయ్‌గౌడ్‌కు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. సోమవారం సాయంత్రం కర్ణాటక వెళ్లారు. అంకోలా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
పోక్సో కేసు
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులు పాల్పడిన 13 మందిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ సోమవారం తెలిపారు. మండలంలోని ఓ మైనర్ బాలికపై పట్టణంలోని ఓ పాఠశాల, అదే గ్రామానికి చెందిన మరికొందరు లైంగికంగా దాడి పాల్పడ్డారని బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదుపై హుజూరాబాద్ ఏసీపీ మాధవి విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు.
జంక్‌ఫుడ్ మానేయాలి
జగిత్యాల: జంక్‌ఫుడ్ మానేయాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అనూష ఆధ్వర్యంలో సోమవారం ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించారు. తాజా పండ్లు, కూరగాయలు తినాలని, ఉప్పు, చక్కెర తక్కువ వాడాలని సూచించారు. సీజనల్‌గా దొరికే పండ్లు తింటే పోషకాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి సుజాత పాల్గొన్నారు.
మద్యం మత్తులో కానిస్టేబుల్ హల్‌చల్
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని శ్రీరామ చౌరస్తా వద్ద ఓ కానిస్టేబుల్ అతిగా మద్యం తాగి తన ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా నడిపి ఓ మహిళ స్కూటీని ఢీకొన్నాడు. మహిళ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు కానిస్టేబుల్‌ను నిలదీశారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ తాను కానిస్టేబుల్‌నని, ఏం చేసుకుంటారో చేసుకోమని దురుసుగా మాట్లాడటంతో స్థానికులు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


