● ద్వితీయ శ్రేణి నాయకులకు గాలం ● పార్టీ వీడకుండా పదవుల ఆశలు ● జీవన్‌రెడ్డి అనుచరులకు ఫోన్లు?
జగిత్యాల: సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడనున్న నేపథ్యంలో అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించకపోవడంతో ఆ పార్టీ ప్లాన్ బీ అమలు చేస్తున్నట్లు తెలిసింది. జీవన్‌రెడ్డి వెంట ఎవరెవరు ఉన్నారు..? ఏ నాయకులు ఎటువైపు వెళ్తున్నారు..? అని ఆరా తీస్తున్నారు. జీవన్‌రెడ్డి అనుచరులకు ఫోన్లు చేస్తూ పార్టీని వీడవద్దని, మంచి భవిష్యత్ ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో జీవన్‌రెడ్డి బండారి గార్డెన్స్‌లో బుధవారం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న నేపథ్యంలో అతని వెంట ఎవరూ వెళ్లకుండా చూసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అభివృద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీ వైపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేతో పనులు చేయించుకోవచ్చని, మిగిలిన నామినేటెడ్ పోస్టులు ఇస్తామంటూ ద్వితీయ శ్రేణి నాయకులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
వెంట వెళ్లేనా..?
పదవి ఉన్నా.. లేకపోయినా జీవన్‌రెడ్డిని నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం అతని వెంటనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో చాలామంది కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అగ్రనేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్న నేపథ్యంలో అందరూ వెళ్లే పరిస్థితి నెలకొంది. దీంతో వారికి పదవుల ఆశ చూపడంతోపాటు, డబ్బులు ఇచ్చేలా చూస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు ఎవరు ఉంటారో..? ఎవరు పోతారో తెలియని పరిస్థితి నెలకొంది.
జిల్లా కోర్టులో బాంబ్ డిస్పోజల్ టీం తనిఖీలు
జగిత్యాలక్రైం: జిల్లా కోర్టు, సబ్ కోర్టుల్లో బాంబ్ డిస్పోజల్ టీం, పోలీసు జగిలాలతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కోర్టులోకి వచ్చేదారితోపాటు వెళ్లేదారి, పార్కింగ్ స్థలాలు, పరిసర ప్రాంతాలను క్షణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువులు, ప్యాకేజీలు, సంచులను తెరిచి చూశారు. కోర్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు.
క్షయ నిర్మూలనకు అవగాహన కల్పించాలి
జగిత్యాల: క్షయ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. సమయానికి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందన్నారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ.. టీబీ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
రైతులంటే చిన్నచూపా..?
జగిత్యాలరూరల్: రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు అని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం హైదర్‌పల్లిలో మొక్కజొన్న పంటను మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులకు విక్రయించి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుభరోసా, రుణమాఫీ చేయక రైతులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. మక్కలను మద్దతు ధర రూ.2400 చొప్పున కొనాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్‌రావు, మాజీ సర్పంచ్‌లు అంజయ్య, బుర్ర ప్రవీణ్‌గౌడ్, నాయకులు సోమిశెట్టి రాజేష్, పొడేటి అంజయ్య లైశెట్టి శంకర్, భీమయ్య, ఓడ్నాల రాములు పాల్గొన్నారు.


