కొత్తగా ఐదు | - | Sakshi
Sakshi News home page

కొత్తగా ఐదు

Mar 25 2026 7:27 AM | Updated on Mar 25 2026 7:27 AM

కొత్తగా ఏర్పాటయ్యే అసెంబ్లీ స్థానాలు

ఉమ్మడి జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు

ఇందులో సుల్తానాబాద్‌, కరీంనగర్‌ రూరల్‌, జగిత్యాల రూరల్‌, మెట్‌పల్లి, ఎల్లారెడ్డిపేట

ఎస్సీలు, మహిళలకు కేటాయించే శాసనసభ నియోజకవర్గాలపై ఉత్కంఠ

రాజకీయా వర్గాల్లో మొదలైన పొలిటికల్‌ హీట్‌

జిల్లాయూనిట్‌గా

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

మ్మడి కరీంనగర్‌ జిల్లాలో కొత్తగా ఐదు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కరీంనగర్‌, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్‌, పెద్దపల్లి, రామగుండం, మంథని, రాజన్న సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. డీలిమిటేషన్‌ ప్రక్రియలో కొత్తగా సుల్తానాబాద్‌, కరీంనగర్‌ రూరల్‌, జగిత్యాల రూరల్‌, మెట్‌పల్లి, ఎల్లారెడ్డిపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పాటు కానున్నాయి. కొత్తవాటితో కలుపుకొంటే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 17కు చేరనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు రాజకీయ సమీకరణాలను మార్చేస్తుంద నే చర్చ సాగుతోంది. ఈ ప్రక్రియ ఎవరికి కలిసి వస్తుంది? ఎవరికి తలనొప్పి తెస్తుందో’ అని ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు.

ప్రయోజనాలు ఏమిటి?

మున్సిపల్‌, సమీప గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్రాతినిధ్యం లభించనుంది. అభివృద్ధి పనులు, నిధులు, స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతమవుతుంది. జిల్లా మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా రాజకీయ అవకాశాలు రాక ఎన్నికల్లో పోటీచేయలేని వారికి బరిలో నిలిచే అవకాశాలు పెరగనున్నాయి.

33 శాతం మహిళా రిజర్వేషన్‌తో..

కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టే జనాభా లెక్కలు –2026 ఆధారంగా.. మహిళా రిజర్వేషన్‌ కోటా నిర్ణయించనున్నారు. పాతవాటితోపాటు కొత్తగా ఏర్పడే అసెంబ్లీస్థానాలతో కలిపి రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజవర్గాలు 179కు చేరనున్నాయి. ఇందులో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే 59 సీట్లు దక్కనున్నాయి. అప్పుడు ఉమ్మడిలోని 17స్థానాల్లో నాలుగు నుంచి ఐదు సీట్లు మహిళలకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే మహిళలకు కేటాయించే స్థానాలు ఏమిటి..? మహిళా ఓటర్లు ఎక్కడ అధికంగా ఉన్నారు..? అనే అంశాలపై నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

ఎస్సీ రిజర్వేడ్‌ స్థానాలు ఏమిటో?

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. డీలిమిటేషన్‌ తర్వాత ఎస్సీలకు కేటాయించే స్థానాలపై ఎవరికి వారే జోరుగా లెక్కలేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఒక్కో నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లో విస్తరించి ఉంది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జిల్లాలే ప్రాతిపదిక అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలో స్పష్టంగా ఉంది. దీంతో జిల్లా యూనిట్‌గా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుంది. అంటే.. జిల్లాలోని మండలాల ఆధారంగానే కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు సరిహద్దులను ఏర్పాటు చేయనున్నారు. ఉదాహరణకు.. సుల్తానాబాద్‌ మున్సిపల్‌, రూరల్‌తోపాటు సమీపంలోని ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల మండలాలతో కలిపి సుల్తానాబాద్‌ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అలాగే రూరల్‌ ప్రాంతంతో కరీంనగర్‌ రూరల్‌, రాయికల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాలతో జగిత్యాల రూరల్‌ నియోజకవర్గం, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌, గంభీరావుపేటతో ఎల్లారెడ్డిపేట నియోజకవర్గం, మెట్‌పల్లి నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement