కోరుట్ల: దాదాపు లక్ష మంది భక్తులు.. 40 వేల బోనాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి తరలివచ్చిన భక్తులు. ఇంత మందికి సౌకర్యాలు కల్పించడంలో ముందు జాగ్రత్త వహించాల్సిన దేవాదాయ శాఖ నిర్లిప్తంగా వ్యవహరించిన ఫలితంగా వేలాది మంది తిప్పలు పడ్డారు. పెద్దాపూర్ జాతరకు పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లు, కార్లు, ఆటోల్లో వచ్చే వారు ఉంటారు.
పార్కింగ్ పరేషాన్
పెద్దాపూర్ మల్లన్న జాతరకు వెళ్లేందుకు నాలుగు దారులు ఉన్నాయి. కోరుట్ల, ఇస్కాన్ టెంపుల్, కెనాల్ బ్రిడ్జి, కోరుట్ల–కోనరావుపేట రోడ్డు, రాంరావుపల్లి బ్రిడ్జి వెంట మరో రూట్ ఉంది. దీనికి తోడు మెట్‌పల్లి– ఆరపేట మీదుగా పెద్దాపూర్ ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ఉండటం సమస్యాత్మకంగా మారింది. వాహనాలు అంత దూరంలో పార్క్ చేసి ముల్లెమూటలతో భక్తులు ఎండలో నడిచివెళ్లడం ఇబ్బందికరంగా మారింది. దేవాదాయ శాఖ అధికారులు ముందుజాగ్రత్తగా పార్కింగ్ స్థలాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పంటలు సాగు చేసే రైతులకు సీజన్‌కు సరిపడా డబ్బు చెల్లిస్తే భక్తుల ఇక్కట్లు తప్పేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కనీస వసతులు కరువు
మల్లన్న సన్నిధిలో భక్తిశ్రద్ధలతో బోనాలు వండి నైవేద్యం సమర్పించి మొక్కు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీ. సుమారు లక్ష మంది భక్తులు హాజరు కావడంతో పాటు 40వేల వరకు బోనాలు తీయడం జరుగుతోంది. బోనాల నైవేద్యం సిద్ధం చేయడానికి దేవాదాయ శాఖ భక్తులకు అరకొరగా టెంట్లు ఏర్పాటు చేసింది. దీంతో ఏటా భక్తులు చెట్ల నీడలో, గ్రామంలోని ఇళ్ల చూరు నీడలో, మురికి కాల్వల పక్కన బోనాలు సిద్ధం చేసుకోవాల్సిన దుస్థితి. ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్న వసతులు కల్పించాలన్న ధ్యాస ఎవరికి లేకపోవడం గమనార్హం. కాగా, ఆలయానికి వెళ్లే దారివెంట వందలాది షాపులకు అనుమతులు ఇచ్చి కనీసం భక్తులు నడవడానికి రోడ్డు లేని పరిస్థితి కల్పించారు. ఇక నీటి వసతి జాడలేదు. అంబులెన్స్ ఎక్కడ ఉంటుందో కనిపించదు. వైద్య సిబ్బంది మొత్తం ఓ గదిలో అడ్జస్ట్ అయిపోయి ఎవరికి కనిపించకుండా, ఎండ తగలకుండా కాలం గడిపేస్తారు. ముదిరిన ఎండలకు భక్తులకు ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే ఎక్కడి వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు.
పట్టించుకోని నేతలు
ఏళ్ల తరబడి మల్లన్న సన్నిధిలో ఇదే పరిస్థితి ఉన్నా కోరుట్ల నియోజకవర్గ నాయకులు ఎవరికి పట్టింపులేకపోవడం గమనార్హం. కేవలం ఫ్లెక్సీలు పెట్టుకుని, ఆలయం చుట్టూ అసలే ఇరుకుగా ఉన్న తోవల్లో పెద్ద కార్లలో అనుచరగణం వేసుకుని రావడం..మట్టి, దుమ్ము లేచి భక్తులు చేసుకునే నైవేద్యాల్లోకి చేరడం..కళ్లల్లోకి చేరి అవస్థలు పడటం జరుగుతోంది. కళ్ల ముందు భక్తులు పడుతున్న అవస్థలు కనిపిస్తున్నా, నేతలు మాత్రం తమ దారిని తాము వచ్చి వెళ్లిపోవడం తప్ప మార్పు, అభివృద్ధి అనే అంశాలపై దృష్టి పెట్టకపోవడం విడ్డూరంగా ఉందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెట్ల కింద వంటలు
ముల్లెమూటలతో నడిచి వెళ్తున్న భక్తులు
పెద్దాపూర్‌లో గుడికి దూరంగా పార్కింగ్
ముల్లెమూటలతో భక్తుల కాలినడక
వంటావార్పునకు చెట్లనీడనే దిక్కు
పట్టించుకోని నేతలు


