పైడిపెల్లిలో రీపోలింగ్ నిర్వహించండి
వెల్గటూర్: తాము 50 ఏళ్ల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఆ పోరాటంలో తాము విజయం సాధించినా.. అధికారులు అడ్డుకున్నారని పేర్కొంటూ మండలంలోని పైడిపెల్లి గ్రామస్తులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. ఈనెల 17న నిర్వహించిన మూడో విడత ఎన్నికల కౌంటింగ్‌లో అవకతవకలు జరిగాయని, మరోసారి పోలింగ్ నిర్వహించాలని సుమారు మూడు వందల మంది ట్రాక్టర్లలో తరలివచ్చి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ నెల 22న జరగనున్న సర్పంచ్ ప్రమాణస్వీకారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. కౌంటింగ్ రోజు గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఎంపీవో కృపాకర్‌కు వినతిపత్రం అందించారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మమత మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోందని, నియంతృత్వాన్ని సహించలేక ప్రజలంతా ఏకతాటిపై నిలబడినా కౌంటింగ్‌లో గోల్‌మాల్ చేసి తనను ఓడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ పూర్తి కాకముందే తాను ఓడిపోయినట్లు ధృవీకరించి, బెదిరించి, బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని, తమకు న్యాయం చేయాలని, రీకౌంటింగ్ చేయాలని శాంతియుతంగా తాము నిరసన తెలిపితే పోలీసులు లాఠీచార్జ్ చేశారని కన్నీరుపెట్టుకున్నారు. ఆడవాళ్లని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపిన తర్వాతనే తాము ప్రాణ రక్షణకు రాళ్లు విసిరామని తెలిపారు. తమను కౌంటింగ్ కేంద్రానికి వందమీటర్ల దూరం ఉంచిన అధికారులు.. ప్రముఖ రాజకీయ నాయకుడి సోదరుడిని కౌంటింగ్ కేంద్రంలోకి ఎలా అనుమతించారని, ఆయనకు కనీసం గ్రామంలో ఓటు కూడా లేదని తెలిపారు. తమకు న్యాయం జరిగేవరకూ పోరాటం కొనసాగుతుందని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కొమ్ము రాంబాబు, ఎలుక రాజు, గాలి హరీశ్, మహిళలు పాల్గొన్నారు.
ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చిన గ్రామస్తులు
ప్రమాణ స్వీకారం ఆపాలని వినతిపత్రం
అక్రమ కేసులు ఎత్తేయాలని డిమాండ్


