.. అను నేను
జగిత్యాల/కోరుట్ల: పల్లె జనాలను మెప్పించి.. ఎన్నికల్లో గెలుపొంది.. వారి మేలు కోసం ఏదైనా చేయాలన్న బాధ్యతతో కొత్త సర్పంచులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సుమారు రెండేళ్ల తర్వాత జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 385 గ్రామ పంచాయతీలు, 3,536 వార్డులకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకూ బిజీగా ఉన్న అధికార యంత్రాంగం.. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల ప్రమాణస్వీకారానికి పూర్తి ఏర్పాట్లు చేసింది.
అధికార బాధ్యతలు
కొత్తగా పల్లెల్లో ఎన్నికై న చాలామంది ప్రజాప్రతినిధులు ప్రమాణస్వీకారం అనంతరం తమ చేతికొచ్చిన అధికార బాధ్యతలతో గ్రామాల్లో చేపట్టే అభివృద్ధితోపాటు సంక్షేమం లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై తమ అనుయాయులతో ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నారు. గ్రామాల్లోని కీలక సమస్యలు, పంచాయతీపరంగా చేయాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి ఉప సర్పంచ్, వార్డుసభ్యులతో కలిసి ముందుకు వెళ్లి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కొత్త సర్పంచులపై ఉంది. గ్రామ పంచాయతీలను నిధుల లేమి కీలక సమస్యగా వేధిస్తున్నా.. ఎన్నికలు పూర్తి అయిన క్రమంలో త్వరలో నిధులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలో తాము ఇచ్చిన హామీలు ఎలాగోలా నెరవేర్చుతామన్న నమ్మకంతో పంచాయతీలకు ఎన్నికై న కొత్త సారథులు ఆశల్లో ఉన్నారు.
మౌలిక వసతులే కీలకం..
ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కీలకంగా మారాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రెండేళ్లుగా నిధులు రాకపోవడంతో సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఇదే కీలకాంశంగా మారింది. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటు మంజూరు కాగానే వాటిని సద్వినియోగం చేయడంతోపాటు ఆదాయ వనరులు పెంచుకోవడంపై కొత్త ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, శివారు ప్రాంతాల్లో విద్యుద్ధీకరణ, టాయ్‌లెట్స్ వంటి అంశాలు కీలక సమస్యలు గా మారాయి. ప్రధానంగా పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరిచి పల్లె ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలో కొనసాగిన రాజకీయాలు, గెలుపోటముల, పంతాలు పక్కన పెట్టి పల్లెల్లో ఒక్కతాటిపై నిలిచి గ్రామాభివృద్దికి పాటుపడతారని ఆశపడుతున్న పల్లె జనాల నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత ఎంపికై న కొత్త ప్రజాప్రతినిధులపై ఉంది.
రెండేళ్ల తరువాత కొలువుదీరనున్న పాలకవర్గాలు
నేడు పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం
గ్రామాల్లో కనీస సౌకర్యాలు మృగ్యం
సర్పంచులకు సమస్యల చిట్టా స్వాగతం
నిధులు లేమితో సతమతం
15వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధులు వస్తే పండుగే
15వ ఆర్థిక సంఘం నిధులపై కొత్త సర్పంచ్‌లు ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లుగా ఈ నిధులు విడుదల కాలేదు. ప్రతి గ్రామానికి దామాషా ప్రకారం ఒక్కోక్కరికి రూ.900 నుంచి రూ.1400 చొప్పన నిధులు రావాల్సి ఉంది. మూడు వేల జనాభా ఉంటే రూ.27లక్షలు వస్తాయి. రెండేళ్లకు సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు పైప్రకారం చూస్తే రూ.54 లక్షలు రానున్నాయి. పంచాయతీల్లో జనాభా ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.80లక్షల వరకు నిధులు వచ్చే అవకాశం ఉంది. మార్చి చివరి నాటికి ఆర్థిక సంఘం గడువు ముగిసిపోనుంది. ఈ లెక్కన రెండేళ్లు నిధులు వస్తే కొత్త సర్పంచ్‌లకు ఊరట కలగనుంది. మొత్తంగా కేంద్రం నుండి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు ఎస్‌ఎఫ్‌సీ నిధులు వస్తనే పల్లెల అభివృద్ది పట్టాలు ఎక్కనుంది. కొత్త సర్పంచుల్లోనూ జోష్ కలుగనుంది.


