అనుమతి కొంత.. తవ్వకాలు ‘కొండ’ంతా
నిబంధనలకు విరుద్ధంగా నల్లగుట్ట తవ్వకాలు గ్రానైట్ కోసం భారీ బ్లాస్టింగ్‌లు భారీ వాహనాలతో ధ్వంసమవుతున్న రహదారులు పెద్ద గుంతలతో ప్రమాదాలు ఆందోళన చెందుతున్న రైతులు
నల్లగుట్ట
జగిత్యాలరూరల్: రెండు గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించే నల్లగుట్టపై గ్రానైట్ వ్యాపారి కన్ను పడడంతో గుట్టను నిత్యం ధ్వంసం చేస్తున్నారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె, రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని నల్లగుట్టపై ఓ గ్రానైట్ వ్యాపారి కన్నుపడి ప్రభుత్వ అనుమతి తీసుకుని విచ్చలవిడిగా గుట్టను ధ్వంసం చేస్తూ నామరూపం లేకుండా చేస్తున్నారు. నిత్యం భారీ ఎత్తున బ్లాస్టింగ్‌లు చేయడంతో తిమ్మాపూర్, మోతె గ్రామానికి చెందిన రైతులు తమ వ్యవసాయ పొలాల వద్ద ఉండేందుకు జంకుతున్నారు. భారీ పేలుళ్లతో రెండు గ్రామాల్లోని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అలాగే జగిత్యాల– గొల్లపల్లి ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు కూడా బ్లాస్టింగ్ జరుగుతున్న సమయంలో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాన్నారు. సమీప ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాల్లో రాళ్లు పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రహదారులు ధ్వంసం
గ్రానైట్ వ్యాపారి తన భారీ వాహనాల్లో పరిమితికి మించి గ్రానైట్‌ను తరలిస్తుండటంతో నల్లగుట్టకు వెళ్లే రహదారులు మొత్తం ధ్వంసమై రైతులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అలాగే తిమ్మాపూర్ నుంచి ధరూర్‌కు వచ్చే బైపాస్‌రోడ్‌పై ఓవర్‌లోడ్ ట్రక్కులు నడవడంతో తారు రోడ్డు పూర్తిగా ధ్వంసమై గుంతలు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
భారీగా గుంతలు
గ్రానైట్ వ్యాపారి గ్రానైట్‌ను భారీ లోతుగా తీయడంతో మోతె గుట్ట శివారులో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో మేతకు వెళ్లిన పశువులు ప్రమాదవశాత్తు గుంతల్లో పడి మృతిచెందుతున్నా వ్యాపారి మాత్రం తన ఇష్టారాజ్యంగా గ్రానైట్ తీస్తూ నల్లగుట్టను నాశనం చేస్తున్నాడు.
అనుమతి కొంత.. తవ్వకాలు ‘కొండ’ంతా


