ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ చేయాలి
ధర్మపురి: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండలంలోని జైనా పీఏసీఎస్ పరిధిలోని దమ్మన్నపేట, రాజారం, నక్కలపేటలోని కొనుగోలు కేంద్రాలను నవంబర్ 21న అడిషనల్ కలెక్టర్ లత సందర్శించారని, ఆ సమయంలో రైతుల నుంచి సన్నరకం కొని దొడ్డు రకం కొన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టి సీఈవోను మాత్రమే సస్పెండ్ చేసినా అసలు బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సన్నాలకు బదులు.. దొడ్డు రకం అని రైతులకు ట్రక్‌షీట్స్ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఈ ఘటనపై ధర్మారం మండలానికి చెందిన ఓ రైస్‌మిల్లర్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ జరిపి సీఈవోను సస్పెండ్ చేసి అసలు కారకులను వదిలిపెట్టారని వివరించారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేలా చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కోరారు. బీఆర్‌ఎస్ నాయకులు అయ్యోరి రాజేష్, సంగి శేఖర్, వొడ్నాల మల్లేశం, తరాల కార్తీక్, చిలువేరు శ్యామ్, అయ్యోరి వేణుగోపాల్, బండారి రంజిత్, అశోక్ ఉన్నారు.


