‘డబుల్’ ఇళ్ల లొల్లి
అర్హులైనా ఇవ్వడం లేదంటూ ఆందోళన నూకపల్లి శివారులో 4,825 ఇళ్ల నిర్మాణం గతంలోనే 4,025 ఇళ్లు కేటాయింపు మిగిలిన 800 గృహాలకు దరఖాస్తులు అనర్హులకు ఇచ్చారంటూ ఆరోపణలు
అర్హులకు ఇళ్లు కేటాయిస్తాం
జగిత్యాల: ‘మేం డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు అర్హులం. మాకు కావాలనే ఇవ్వడం లేదు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ మమ్మల్ని విస్మరిస్తున్నారు..’ అంటూ కొందరు డబుల్‌బెడ్‌రూం ఇళ్ల దరఖాస్తుదారులు తీవ్ర ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాకేంద్రం శివారు నూకపల్లిలో గతంలోనే 4825 ఇళ్లు నిర్మించిన విషయం తెల్సిందే. వాటిలో సుమారు నాలుగు వేల ఇళ్ల వరకు లబ్ధిదారులకు కేటాయించారు. మిగిలిన ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని మున్సిపాలిటీలోని 48 వార్డుల్లోగల ప్రజలకు అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు కూడా స్వీకరించారు. ముందుగా మున్సిపల్ అధికారులు ఎలాంటి సభలూ నిర్వహించకుండానే జాబితా రూపొందించడంతో వాటిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో స్పందించిన అధికారులు వెంటనే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తుదారుల జాబితాను వార్డు సభల్లో పెట్టారు. అనంతరం 535 మందిని ఎంపిక చేశారు. అయినప్పటికీ చాలా మంది అర్హులకు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
535 ఇళ్ల కేటాయింపు
జిల్లా కేంద్రంలోని అర్బన్ హౌసింగ్ కాలనీలో నిర్మించిన 4,825 ఇళ్లను డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. 800లకు పైగా ఇళ్లు మిగిలిపోగా. నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ బల్దియాలోని ప్రజలకు సూచించారు. వీరిలో దరఖాస్తు చేసుకున్న 535 మందిని అర్హులుగా గుర్తించి వారికి ఇళ్లు కేటాయించారు.
దరఖాస్తుదారుల ఆందోళన
535 ఇళ్లకు సంబంధించి కలెక్టరేట్‌లో ఆర్డీవో మధుసూదన్ సమక్షంలో శనివారం డ్రా నిర్వహించి ఇళ్లు కేటాయించారు. దరఖాస్తుదారులు కొందరు తాము అర్హులమైనప్పటికీ రాలేదంటూ బైటాయించారు. తహసీల్దార్ రాంమోహన్ చేరుకుని ప్రజావాణిలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, అర్హులకు న్యాయం చేస్తామని, ఇంకా 500లకు పైగా ఇళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో దరఖాస్తుదారులు అర్బన్ హౌసింగ్ కాలనీకి వెళ్లి డబుల్‌బెడ్‌రూం ఇళ్ల తాళాలు పగులగొట్టారు. తమకు కేటాయించకున్నా.. ఇళ్లలోనే ఉంటామని స్పష్టం చేశారు. ఆర్డీవో అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయించారు. అధికారులు డబ్బులకు అమ్ముడు పోతున్నారని, పూర్తిస్థాయిలో అర్హులమైనా ఇవ్వడం లేదని ఆరోపించారు. వారినందరినీ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వద్దకు తీసుకెళ్లగా.. అర్హులందరికీ వచ్చేలా చూస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వెనుదిరిగినట్లు సమాచారం.
మొదటి నుంచీ గొడవే
నూకపల్లి వద్ద 2009లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అప్పటి మంత్రి జీవన్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారు. అప్పుడు లబ్ధిదారులు చాలా మంది బేస్‌మెంట్ వరకే నిర్మించుకుని వదిలేశారు. అనంతరం బీఆర్‌ఎస్ హయంలో మళ్లీ నాలుగు వేలకు పైగానే డబుల్‌బెడ్‌రూం ఇళ్లు మంజూరై నిర్మితమయ్యాయి. ప్రస్తుతం దానిని అర్బన్ హౌసింగ్‌బోర్డు కాలనీగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అక్కడ అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లు, దేవాలయాలు, మసీదుల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నారు. బేస్‌మెంట్ వరకు కట్టుకున్న లబ్ధిదారులు తమకు డబుల్‌బెడ్‌రూంలు కేటాయించాలని, లేదా తాము కట్టుకున్న బేస్‌మెంట్ విడిచిపెట్టాలంటూ ఆందోళనకు దిగారు. అయితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నా.. డబుల్‌బెడ్‌రూంల నిబంధనల ప్రకారం వారు అర్హులు కాకుండా పోతున్నారు. దీంతో అప్పటి లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చేపడుతున్నారు. అలాగే ఇప్పుడు సైతం చాలా మంది దరఖాస్తుదారులు రాకపోవడంతో ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
360 డిగ్రీల యాప్‌తోనే ఇబ్బంది
ప్రస్తుతం డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిబంధనలే అర్హులకు శాపంగా మారినట్లు తెలిసింది. అర్హులైన వారి పేర్ల మీద ఎవరైనా మోటార్ సైకిల్ కొనుకున్నా, ఆర్సీ స్లాబ్ ఇల్లు ఉన్నా ఇలాంటివి ఉంటే 360 డిగ్రీ యాప్‌లో అనర్హులుగా చూపుతోంది. గతంలో ఏవైనా పథకాలు పొంది ఉన్నా అనర్హులుగానే గుర్తిస్తుంది. దీంతో అర్హులైన వారు సైతం దీని వల్ల ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. అధికారులు వీటిని గుర్తించి డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇచ్చేలా చూడాలని కోరుతున్నారు.
అర్హులైన వారందరికీ డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కేటాయిస్తాం. ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. అనధికారికంగా వెళ్లి ఇళ్లలో ఉంటామంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే మళ్లీ పరిశీలించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం.
– మధుసూదన్, జగిత్యాల ఆర్డీవో
‘డబుల్’ ఇళ్ల లొల్లి


